భారత్‌లో అత్యంత విలువైన ఖనిజం.. అమెరికా కంటే మన దగ్గరే అధికం

13 Feb, 2023 11:05 IST|Sakshi
రియాసీ జిల్లాలో లిథియం ఖనిజం ఉన్న శిలలను చూపుతున్న గ్రామస్థుడు

కశ్మీర్‌లో 59 లక్షల టన్నుల లిథియం  

బ్యాటరీల తయారీలో అత్యంత కీలకం 

అంతరిక్ష పేలుళ్ల వల్ల ఏర్పడిన అరుదైన లోహం 

ఆధునిక యుగంలో ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాధాన్యం నానాటికీ పెరిగిపోతోంది. సౌర విద్యుదుత్పత్తిని పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే పొద్దు గడవదు. మరి ఈ అవసరాలన్నీ తీరాలంటే ఏం కావాలో తెలుసా? లిథియం. అత్యంత విలువైన ఈ ఖనిజాన్ని పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం పెద్దగా ఉండదు. ఎందుకంటే 59 లక్షల టన్నుల నాణ్యమైన లిథియం నిల్వలు జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం కొలువైన కొండల దిగువన సలాల్‌ హైమన గ్రామం వద్ద ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) ఇటీవల గుర్తించింది. భారత్‌లో ఈ స్థాయిలో లిథియం నిల్వలు బయటపడడం ఇదే తొలిసారి! 

తవ్వకాలతో నీటి నిల్వలకు ముప్పు!
ఖనిజ తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు తప్పదు. లిథియం తవ్వకాల కారణంగా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుందని, ప్రకృతిపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లిథియం తవ్వకాలు చేపట్టిన ప్రాంతాల్లో నీటి నిల్వలు అంతరించిపోతాయని హెచ్చరిస్తున్నారు. భూమిపై తేమ తగ్గిపోయి, కరువు నేలగా మారుతుందని పేర్కొంటున్నారు. ఒక టన్ను లిథియం కోసం తవ్వకాలు సాగిస్తే ఏకంగా 15 టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదల అవుతుందని సమాచారం. ఒక టన్ను లిథియం తవ్వకానికి దాదాపు రూ.64 లక్షల ఖర్చవుతుంది. లిథియం వెలికితీతకు భారీస్థాయిలో నీరు అవసరం.

లిథియం అంటే?   
తెల్ల బంగారంగా పిలిచే లిథియం అనే పదం గ్రీక్‌ భాషలోని లిథోస్‌ (రాయి) నుంచి పుట్టింది. ఇది ఆల్కలీ మెటల్‌ గ్రూప్‌కు చెందినది. తేలికగా, మృదువుగా, తెల్లటి రంగులో వెండిలాగా మెరిసే లోహం. పీరియాడిక్‌ గ్రూప్‌ 1(ఐఏ)లో లిథియంను చేర్చారు. ఇది భూగోళంపై సహజంగా ఏర్పడింది కాదు. అంతరిక్షంలో సంభవించిన పేలుళ్ల వల్ల ఏర్పడినట్లు గుర్తించారు. బిగ్‌బ్యాంగ్‌ వల్ల విశ్వం పుట్టిన తొలినాళ్లలో భూగోళంపై లిథియం నిల్వలు మొదలైనట్లు తేల్చారు. ఇతర గ్రహాలపైనా లిథియం ఉంది.

500  పీపీఎం నాణ్యత  
సాధారణ లిథియం నాణ్యత 220 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉంటుంది. కానీ కశ్మీర్‌లో కనుగొన్న లిథియం నాణ్యత ఏకంగా 500 పీపీఎంగా ఉండటం విశేషం. లిథియంను ఇతర లోహాలతో కలిపి మిశ్రమ లోహాలను తయారు చేస్తారు. విద్యుత్‌తో నడిచే వాహనాల బ్యాటరీల తయారీకి లిథియం కీలకం. ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, డిజిటల్‌ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర విద్యుత్‌ పరికరాల  బ్యాటరీల తయారీలోనూ ఉపయోగిస్తారు. గాజు, సెరామిక్‌ పరిశ్రమల్లో లిథియం వాడకం అధికంగా ఉంది.

పవన, సౌర విద్యుత్‌ను నిల్వచేసే బ్యాటరీలు లిథియంతో తయారవుతాయి. రీచార్జి చేయడానికి వీల్లేని బ్యాటరీల్లోనూ వాడుతారు. పేస్‌మేకర్లు, బొమ్మలు, గడియారాల్లోని బ్యాటరీల్లో లిథియం ఉంటుంది. 2030 నాటికి మన దేశంలో 27 గిగావాట్ల గ్రిడ్‌–స్కేల్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్‌ కావాలని అంచనా. అంటే రానున్న రోజుల్లో లిథియం అవసరం ఎన్నో రెట్లు పెరిగిపోనుంది. అంతర్జాతీయంగా లిథియం మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2008 నుంచి 2018 నాటికి దీనికి వార్షిక ఉత్పత్తి 25,400 టన్నుల నుంచి 85,000 టన్నులకు చేరింది.

ఐదో స్థానంలో భారత్‌  
3.9 కోట్ల టన్నులతో బొలీవియా ప్రపంచంలో తొలిస్థానంలో ఉంది. చిలీ, ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, అర్జెంటీనా తదితర దేశాల్లో కోట్ట టన్నుల నిల్వలున్నట్లు కనిపెట్టారు. భారత్‌లో కర్నాటకలోని మండ్యా జిల్లాలో 1,600 టన్నుల లిథియం ఉన్నట్లు రెండేళ్ల క్రితం గుర్తించారు. తాజాగా కశ్మీర్‌లో బయట పడ్డ 59 లక్షల టన్నులతో కలిపితే ప్రపంచంలో భారత్‌ ఐదో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో కంటే భారత్‌లోనే అధిక నిల్వలున్నాయి. ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆస్ట్రేలియా, చిలీ, చైనా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆస్ట్రేలియా, చిలీ, అర్జెంటీనా నుంచి భారత్‌ లిథియంను దిగుమతి చేసుకుంటోంది. ముడి లిథియంను శుద్ధి చేసి, బ్యాటరీల తయారీకి అనువైన లోహంగా మార్చడం కఠినమైన ప్రక్రియ. ఇందులో సాధించేదాకా మరో రెండేళ్లపాటు దిగుమతులపై ఆధారపడక తప్పదని నిపుణులు చెబుతున్నారు.

ఏ దేశంలో ఎన్ని నిల్వలు(టన్నుల్లో)  
దేశం    లిథియం నిల్వలు  
బొలీవియా    3,90,00,000  
చిలీ    1,99,03,332
ఆస్ట్రేలియా    77,17,776
చైనా    66,90,180
భారత్‌    59,00,000
అమెరికా    57,62,917  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు