కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్‌ కేసులు

21 Aug, 2022 05:33 IST|Sakshi

న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 5 కోట్లకు చేరువలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఒక న్యాయమూర్తి 50 కేసుల్ని పరిష్కరిస్తే, కొత్తగా మరో 100 కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. వివాదాల పరిష్కారానికి న్యాయస్థానాలను ఆశ్రయించాలన్న అవగాహన ప్రజల్లో బాగా పెరిగిందని అందుకే కొత్త కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌  సమక్షంలో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ట్రబ్యునల్‌ పనితీరుపై శనివారం జరిగిన సెమినార్‌కు కిరణ్‌ హాజరయ్యారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు. కింద కోర్టుల్లో 4 కోట్లకు పైగా, సుప్రీం కోర్టులో 72 వేల కేసులకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే భారం తగ్గుతుందన్నారు. కేంద్రం ప్రతిపాదనలో ఉన్న మధ్యవర్తిత్వంపై చట్టాన్ని త్వరగా తీసుకువస్తే కోర్టులకి కొంత ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ మరో కార్యక్రమంలో మాట్లాడుతూ కోర్టులో పెరిగిపోతున్న పెండింగ్‌ కేసులు మోయలేని భారంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ వ్యవస్థే  కేసుల భారాన్ని తగ్గిస్తుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు