అక్రమ మైనింగ్‌ గనిలో ఇరుక్కుపోయిన ఐదుగురు

1 Jun, 2021 08:52 IST|Sakshi

షిల్లాంగ్‌: మేఘాలయలో దారుణం చోటు చేసుకుంది. జైంతియా హిల్స్‌ జిల్లాలోని అక్రమ మైనింగ్‌ గనిలో ఐదుగురు కార్మికులు ఇరుక్కుపోయినట్లు మేఘాలయ పోలీసులు సోమవారం వెల్లడించారు. ఐదుగురు ఆదివారం ఓ డైనమైట్‌ పేల్చిన ఘటనలో గని కుప్పకూలడంతో ఇరుక్కుపోయారని, ఆ విషయం సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఆ ఐదుగురూ అస్సాంకు చెందిన వారని సిల్చార్‌ ఎస్పీ వెల్లడించినట్లు మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు.

తావరణం అనుకూలించకపోవడం, సరైన వెలుతురు లేకపోవడం, ప్రత్యక్ష్య సాక్షులు లేకపోవడం వంటి కారణాల వల్ల ఘటనను గుర్తించడంలో ఆలస్యమైందని ఈస్ట్‌ జైంతియా హిల్స్‌ ఎస్పీ జగ్‌పాల్‌ ధనోవా పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రత్యేకంగా విచారించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జైంతియా హిల్స్‌లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని అస్సాం ప్రజలు ఆరోపిస్తుండగా, ఆ విషయంపై తనకు అంత అవగాహన లేదని స్థానిక ఎమ్మెల్యే షైలా చెప్పారు. ఆ విషయాన్ని పరిశీలించాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు.

(చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!)

>
మరిన్ని వార్తలు