డిజిట‌ల్‌ చెల్లింపులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

5 Apr, 2021 16:45 IST|Sakshi

సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకి భాగా విస్తరించడంతో అన్ని రంగాల‌లో విస్తృత‌‌మైన మార్పులు తీసుకొచ్చింది. నగదు చెల్లింపుల విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే కోవిడ్‌-19, లాక్‌డౌన్ కార‌ణంగా క్రెడిట్‌/డెబిట్ కార్డు, యూపీఐ, డిజిట‌ల్ చెల్లింపుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతి చిన్న వస్తువు కొనడానికి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నాం. దీంతో ప్రతి రోజు లావాదేవీలు చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. అదే స్థాయిలో సైబ‌ర్ నేరాలు కూడా పెరిగి పోతున్నాయి. ఇటువంటి సైబర్ నేరగాళ్ల భారిన ప‌డ‌కండా సౌక‌ర్య‌వంతంగా, సుర‌క్షితంగా చెల్లింపులు చేసేంద‌కు కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం.

కార్డు వివరాలను సేవ్ చేయకండి
మీరు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేటప్పుడు మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు సేవ్ చేయకుండా చూసుకోవడం మంచిది. మనలో చాలా మంది ఆన్‌లైన్‌లో త్వరగా చెల్లింపులు చేయడానికి వారి వివరాలను సేవ్ చేస్తారు. అయితే, ఇలా చేయడం వల్ల మీ ఆన్‌లైన్ కొనుగోలు పూర్తైన తర్వాత మీ కార్డు సమాచారం దొంగిలించే అవకాశం ఎక్కువ. అందుకని, మీ ఆన్‌లైన్ కొనుగోలు తర్వాత కార్డు వివరాలు సేవ్ చేయకపోవడం లేదా క్లియర్ చేయడం మంచిది.

లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడండి
డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైనది అనుమానాస్పద యాప్‌లు, వెబ్‌సైట్‌ల‌ను వాడకపోవడం. యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న విశ్వసనీయ అధికారిక యాప్‌ల‌ను మాత్ర‌మే ఉప‌యోగించ‌డం మంచిది. అలాగే, ప్రైవేట్‌/వ‌ర్చువ‌ల్ బ్రౌజ‌ర్‌లను, HTTPS://తో ప్రారంభ‌మ‌య్యే సుర‌క్షిత క‌న‌క్ష‌న్ల‌ను ఎంచుకుని మ‌రింత భ‌ద్రంగా ఆర్థిక లావాదేవీల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ప్రైవేట్ విండో వాడటం మంచిది. దీనివల్ల మీ కార్డు వివరాలు సేవ్ కావు.

పాస్‌వర్డ్‌లు షేర్ చేయవద్దు
మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్‌వర్డ్‌లు ఎల్లప్పుడూ బలంగా ఉంచేలా చూసుకోవడం మంచిది. పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ షేర్ చేసుకోకపోవడం, సైబర్ దాడులకు గురికాకుండా ఉండటానికి క్రమం తప్పకుండా పాస్‌వర్డ్‌లు మార్చుతూ ఉండాలి. అలాగే, మీ పాస్‌వర్డ్‌లు లేదా ఎటిఎం పిన్ వంటి వివరాలను ఎవరైనా ఫోన్ చేసి అడిగితే మీ బ్యాంకుకు తెలియజేయండి. ఒన్‌-టైమ్‌-పాస్‌వ‌ర్డ్‌(ఓటీపీ) సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డం ద్వారా మ‌రింత భ‌ద్రంగా లావాదేవీలు నిర్వ‌హించుకోవ‌చ్చు. 

పేవ‌రల్డ్ సీఈఓ ప్ర‌వీణ్ దాబాయ్ మాట్లాడుతూ - "సుర‌క్షిత‌మైన లావాదేవీల కోసం విశ్వ‌నీయ వెబ్‌సైట్‌ల‌లో మాత్ర‌మే డెబిట్‌/  క్రెడిట్ కార్డుల‌ను ఉప‌యోగించాలని, ఓటీపీని ఎవ‌రితోనూ పంచుకోకూడ‌దని, వెర్చువ‌ల్ కీ బోర్డును మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని, వెబ్‌సైట్ నుంచి త‌ప్ప‌నిస‌రిగా లాగ‌వుట్‌ అవ్వాలి" అని  తెలిపారు. 

పబ్లిక్ కంప్యూటర్లు/వై-ఫై నెట్‌వర్క్‌లు వాడొద్దు
ఆన్‌లైన్ లావాదేవీలు చేసేటప్పుడు సైబర్ దాడులు, దొంగతనం, ఇతర మోసపూరిత కార్యకలాపాలు జరిగే అవకాశం ఎక్కువ. కావున పబ్లిక్ పరికరాలు లేదా వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా ఉండడం మంచిది. అలాగే ధృవీకరించబడిన వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించడం కూడా ముఖ్యం. విశ్వసనీయ వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ చెల్లింపు లావాదేవీలకు ఎక్కువ రక్షణను అందిస్తాయి.

మోస‌పూరిత యాప్‌లతో జాగ్ర‌త్త..
యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లో కూడా చాలా నకిలీ యాప్‌లు ఉన్నాయి. వీటిని నెగటివ్ రివ్యూలు, తక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్‌లు, 'ధృవీకరించబడిన' బ్యాడ్జ్ లేకపోవడం ద్వారా గుర్తించవచ్చు. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇది యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్‌లో దృవీకరించబడిందా లేదా అని నిర్ధారించుకోండి. మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ యాప్‌ల‌కు కూడా చట్టబద్ధత‌ ఉండాలి. యాప్‌ల‌ను ఇస్టాల్ చేసేప్పుడు కెమెరా, ఫోన్ బుక్‌, ఎస్ఎమ్ఎస్ మొద‌లైన వాటికి అనుమ‌తి నిరాక‌రించడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.

చదవండి:

కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్‌బీఐ షాక్!

మరిన్ని వార్తలు