ఎంత దారుణం: అయిదేళ్లలో దేశంలో ఇన్ని అఘాయిత్యాలా!

5 Aug, 2021 08:15 IST|Sakshi

2019లో నమోదైన కేసుల సంఖ్య

దేశంలో అయిదేళ్లలో లక్షన్నరకు పైగా అత్యాచారాలు 

సీఏఏ-2019కు సవరణ ప్రతిపాదన లేదు 

4 వేల మందికి భారత పౌరసత్వం 

మూడేళ్లలో 630 మంది ఉగ్రవాదులు హతం

1,948 మందిపై ఉపా చట్టం

పార్లమెంటుకు వెల్లడించిన కేంద్రం 

న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (ఉపా) కింద 2019 లో 1,948 మంది అరెస్టయ్యారని, 34 మంది దోషులుగా తేలారని కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది.  అలాగే 2015-2019 మధ్య దేశంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుండి అత్యధికకేసులు నమోదుకాగా, తర్వాత రాజస్థాన్, యూపీ తరువాతి స్థానాల్లో నిలిచాయి డీఎంకే సభ్యుడు అడిగి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డీఎంకే సభ్యుడు తిరుచి శివ ఈ ప్రశ్నను అడిగారు. 

అయిదేళ్లలో 1.71 లక్షల అత్యాచారాలు.. 
2015-19 మధ్య దేశంలో 1.71 లక్షల అత్యాచారాలు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా ఈ వివరాలను రాజ్యసభకు లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో 22,753, రాజస్తాన్‌లో 20,937, ఉత్తరప్రదేశ్‌లో 19,098, మహారాష్ట్రలో 14,707, ఢిల్లీలో 8,051 అత్యాచారాలు జరిగాయి.

సీఏఏ సవరణ లేదు.. 
2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి సవరణలు చేసే ప్రతిపాదనలేవీ లేవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ పేర్కొన్నారు. మార్పులేమైనా తీసుకొచ్చి ఇతర మైనారిటీలకు పౌరసత్వం కల్పిస్తారా అన్న ప్రశ్నకు ఆయన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అలాంటి ప్రతేపాదనేదీ తమకు లేదని స్పష్టం చేశారు. 2019 చట్టం ప్రకారం అర్హులైన వారందరికీ పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. 

12,600 శత్రు ఆస్తులు.. 
దేశంలో 12,600కు పైగా శత్రు ఆస్తులను కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ ఫర్‌ ఇండియా (సీఈపీఐ) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా ఈ వివరాలను రాజ్యసభలో వెల్లడించారు. భారత్‌ వదలి పాకిస్తాన్, చైనాలకు వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్న వారి ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు. ఇందులో పాకిస్తాన్‌కు వెళ్లిన వారి ఆస్తులు 12,485కాగా, 126 చైనాకు వెళ్లిన వారివి. శత్రు ఆస్తుల్లో అధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే (6,255) ఉన్నాయి. 

ఆర్నెళ్లలో 12,001 సైబర్‌ ఘటనలు.. 
ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో 12,001 సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ మేరకు లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ తెలిపిన వివరాల ప్రకారం 2020లో 11,58,208, 2021 (జూన్‌ వరకు) 6,07,220 సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు జరిగినట్లు తెలిపారు.

సీఏపీఎఫ్‌లో 680 ఆత్మహత్యలు.. 
సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌ వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో (సీఏపీఎఫ్‌) గత ఆరేళ్లలో మొత్తం 680 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ ఈ విషయాలను రాజ్యసభకు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రమాదాల కరాణంగా 1,764 మంది, ఎన్‌కౌంటర్లలో 323 మంది మరణించారని తెలిపారు. ఆత్మహత్యలకు ఆర్థిక కారణాలు, అనారోగ్యం వంటివి ఉండొచ్చని అన్నారు. 

183 మంది రైతులు అరెస్టు.. 
కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల వద్ద గత ఏడాది నుంచి నిరసనలు చేపట్టిన ఘటనల్లో ఢిల్లీ పోలీసులు మొత్తం 183 మంది రైతులను అరెస్టు చేశారని కేంద్రం రాజ్యసభలో తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ దీనికి సంబంధించి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశద్రోహ చట్టం, ఉపా చట్టం వంటి వాటిని వారిపై ప్రయోగించలేదని పేర్కొన్నారు.

630 మంది ఉగ్రవాదులు హతం 
మూడేళ్లలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన 400 ఎన్‌కౌంటర్లలో 630 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ వివరాలను లిఖితపూర్వకంగా అందించారు. ఎన్‌కౌంటర్లలో 85 మంది భద్రతా బలగాలకు చెందిన సైనికులు కూడా మరణించారన్నారు. 2018 మే నుంచి 2021 జూన్‌ వరకు సంబంధించిన వివరాలు ఇవి అని తెలిపారు.

4,046 మందిదరఖాస్తులు పరిశీలనలో.. 
అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన హిందువులు 4,046 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని, అవి పలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ విషయాలను రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. వీటిలో రాజస్తాన్‌ ప్రభుత్వం వద్ద 1,541 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 2016-2020ల మధ్య మొత్తం 4,171 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు