యూపీ: వైరల్‌ ఫీవర్‌తో 50 మంది చిన్నారుల మృతి!

1 Sep, 2021 19:16 IST|Sakshi

లక్నో: దేశంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా..  ఉత్తర ప్రదేశ్‌లో వైరల్‌ జ్వరం ప్రజలను బెంబేలేత్తిస్తుంది.  వైరల్‌ జ్వరంతో ఫిరోజాబాద్‌లో ఇప్పటి వరకు 50  మంది చిన్నారులు మృతి చెందినట్టు హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ధృవీకరించింది. కాగా, ఈ ఘటనను సీఎం యోగి  తీవ్రంగా పరిగణించారు. ఆసుపత్రులలో సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఫిరోజాబాద్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంవో)ను విధుల నుంచి తొలగించారు. సీఎం యోగి ఆదేశాలతో, అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు.

కాగా, ప్లేట్‌లేట్‌ల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత సోమవారం (ఆగస్టు 30)న సీఎం యోగి ఫిరోజాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు ప్రతి ఇంటికి వెళ్లి వైరల్‌ జ్వరం పట్ల అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైన జ్వరంతో బాధపడుతుంటే వారికి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పారిశుద్ధ్య అధికారులు స్థానికంగా పరిశుభ్రతను పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ వైరస్‌ జ్వరాన్ని డెంగీగా వైద్యఅధికారులు భావిస్తున్నప్పటికీ దీనిపై స్పష్టత లేదు. 

చదవండి: Suspicious Fever: వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి

మరిన్ని వార్తలు