ముంబై, గుజరాత్‌ తీరాల్లో రూ.852 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత

9 Oct, 2022 05:49 IST|Sakshi

ముంబై/అహ్మదాబాద్‌: వేర్వేరు తీరప్రాంతాల్లో రూ.852 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. మహారాష్ట్రలోని నవీ ముంబై పొరుగున ఉండే నహావా షెవా నౌకాశ్రయంలో ఆపిల్‌ పండ్ల కంటైనర్‌లో యాభై కేజీల అత్యంత నాణ్యమైన కొకైన్‌ మాదకద్రవ్యాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల్లా ఒక్కోటి కేజీ బరువుండేలా ప్యాక్‌చేసిన డ్రగ్స్‌ను గ్రీన్‌ ఆపిల్స్‌ మధ్యలో అధికారులు కనుగొన్నారు.

సముద్రమార్గ కంటైనర్లలో ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్‌ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి స్మగ్లర్లు భారత్‌కు తరలించారు. మొత్తంగా 50.23 కేజీల బరువున్న ఈ డ్రగ్స్‌ అంతర్జాతీయ విపణిలో ఏకంగా రూ.502 కోట్ల ధర పలుకుతాయని రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారి ఒకరు శనివారం చెప్పారు. వశీలో ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బత్తాయి పండ్ల మాటున 198 కేజీల మెథ్, 9 కేజీల కొకైన్‌ను కంటైనర్‌లో తెప్పించిన దిగుమతిదారు వీటినీ తెప్పించాడు. గత వారం నమోదైన కేసులో ఇప్పటికే ఇతడిని పోలీసులు అరెస్ట్‌చేయడం తెల్సిందే.

గుజరాత్‌లో మరో 50 కేజీలు
పాకిస్తాన్‌ నుంచి వస్తూ గుజరాత్‌ తీరానికి దూరంగా సముద్రజలాల్లో అడ్డగించిన ఒక పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం, ఉగ్ర వ్యతిరేక దళాలు స్వాధీనంచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వేళ ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. అల్‌ సకర్‌ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్తానీయులను అరెస్ట్‌చేసి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరభారతం, పంజాబ్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే పాకిస్తాన్‌ డ్రగ్‌ మాఫియా ఈ సరకును పంపించాడని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు