19 లక్షలు దాటిన కరోనా కేసులు

6 Aug, 2020 06:25 IST|Sakshi

2 కోట్లు దాటిన పరీక్షల సంఖ్య

పెరిగిన రికవరీ

తగ్గిన మరణాల శాతాలు

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఏడో రోజూ 50 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,08,254కు చేరుకుంది. 24 గంటల్లో 51,706 కోలుకోగా మొత్తం మొత్తం దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 12,82,215కు చేరుకుంది. మరోవైపు మంగళవారం 857 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 39,795కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,86,244కు చేరుకుంది. మొత్తం కేసుల శాతంలో యాక్టివ్‌ కేసుల శాతం 30.72గా ఉంది. 14 రోజుల్లో 63.8 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశంలో రికవరీ రేటు 67.19 శాతం పెరగ్గా, మరణాల రేటు 2.09కు పడిపోయిందని పేర్కొంది. ఐసీఎంఆర్‌ డేటా ప్రకారం ఆగస్టు 4 వరకూ 2,14,84,402 పరీక్షలు చేసినట్లు తెలిపింది. మంగళవారం 6,19,652 పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపింది. తాజా 857 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 300 మంది మరణించారు. తమిళనాడులో 108, కర్ణాటక నుంచి 110, పశ్చిమబెంగాల్‌లో 54, ఉత్తర ప్రదేశ్‌లో 39, రాజస్తాన్‌ బిహార్లలో 12 మంది మరణించినట్లు తెలిపింది. మొత్తం మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ప్రతి మిలియన్‌ మందికి చేస్తున్న పరీక్షల సంఖ్య 15,568కు చేరుకుంది.

కరోనా యోధులకు కృతజ్ఞతగా..మిలటరీ బ్యాండ్‌ ప్రదర్శన
కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక మిలటరీ బ్యాండ్‌ ప్రదర్శన దేశవ్యాప్తంగా ఆగస్టు 1న మొదలైనట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజులపాటు.. ఆగస్టు 15వ తేదీ వరకు ఈ ప్రదర్శన ముఖ్యనగరాలు, పట్టణాల్లో కొనసాగుతందని వెల్లడించాయి. ఇప్పటికే పోరుబందర్, హైదరాబాద్, అలహాబాద్, కోల్‌కతా తదితర నగరాల్లో ఈ ప్రత్యేక మిలటరీ బ్యాండ్‌ ప్రదర్శన జరిగింది.

కోలుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం
భోపాల్‌: మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ (61) కరోనా నుంచి కోలుకున్నారు. మరో 11 రోజుల పాటు ఆయన్ను ఇంటిలోనే క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారని ఆయన వెల్లడించారు. ఆదివారం జరిపిన పరీక్షలో నెగిటివ్‌ వచ్చిందని చెప్పారు. గత నెల 25న ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. అనంతరం ఓ ప్రైవేటు ఆçస్పత్రిలో చికిత్స పొందారు. గత 10 రోజులుగా చౌహాన్‌కు ఏ లక్షణాలు లేవని వైద్యులు తెలిపారు. ఐసీఎంఆర్‌ విధానం ప్రకారం 10 రోజుల పాటు ఏ లక్షణాలు లేకపోతే వారిని డిశ్చార్జ్‌ చేయవచ్చు. తనకు వైద్యం అందించిన వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు