Sikkim Floods: ఆకస్మిక వరదలతో సిక్కిం కకావికలం.. 53కు చే రిన మరణాలు

7 Oct, 2023 10:37 IST|Sakshi

ఆకస్మిక వరదలు, క్లౌడ్‌బర్స్ట్‌తో సిక్కిం రాష్ట్రం కకావికలమైంది. ఉత్తర సిక్కింలోని లోనాక్‌ సరస్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కురిసిన కుంభవృష్టి వర్షం, చుంగ్‌తాంగ్‌ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా నదిలో నీటిమట్టం పెరగి వరద నీరు ఉప్పొంగి ప్రవహించింది. ఈ వరదల్లో ఆర్మీ జవాన్లు సహా వందలాది మంది గల్లంతయ్యారు.  గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిర్వీరామంగా గాలిస్తున్నాయి.

పెరుగుతున్న మరణాలు
సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది.  వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య ప్రస్తుతం 53కు చేరింది. వీరిలో ఏడుగురు జవాన్లు కూడా ఉన్నారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నదిలో ఇప్పటి వరకు 27 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటిలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఇంకా 140 మంది ఆచూకీ తెలియడం లేదు. రాష్ట్రంలో 1,173 ఇళ్లు దెబ్బతిన్నాయని, రద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 2,413 మంది ప్రజలను రెస్క్యూ బృందాలు రక్షించినట్లు సిక్కిం ప్రభుత్వం పేర్కొంది.

జల విలయానికి 13 వంతెనలు ధ్వంసమయ్యాయని, రోడ్ల కనెక్టివీటి తెగిపోయిందని తెలిపింది. అయితే 6,875 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా 22 సహాయ శిబిరాల్లో వీరంతా ఆశ్రయం పొందుతున్నాదరని తెలిపింది. తీస్తా-V జల విద్యుత్‌ కేంద్రానికి దిగువన ఉన్న అన్ని వంతెనలు మునిగిపోయి వరదలో కొట్టుకుపోయాయని పేర్కొంది. ఉత్తర సిక్కింలో కమ్యూనికేషన్‌కు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించింది.

సీఎం ఉన్నతస్థాయి సమావేశం
వదరల నేపథ్యంలో సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ​ తమాంగ్‌ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు, పునరుద్దరణ పనులపై సమీక్షించారు. చుంగ్‌తంగ్ వరకు రోడ్డు కనెక్టివిటీని ప్రారంభించేందుకు చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగా నుంచి టూంగ్ వరకు వీలైనంత త్వరగా రహదారిని నిర్మించాలని పేర్కొన్నారు. కుంభవృష్టి వర్షాలు, వరదలతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.

నదిలో కొట్టుకొస్తున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి
తీస్తా నది వరదల్లో ఆర్మీకి చెందిన పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కొట్టుకొని వచ్చిన ఆయుధం పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడటం కలవరపెడుతోంది. దీంతో నదిలో కొట్టుకువచ్చే పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సిక్కిం ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది. నదీ తీరం వెంట వాటిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను సైన్యం రంగంలోకి దింపింది.

మరో అయిదు రోజులు వర్షాలు
భారత వాతావరణ శాఖ రాబోయే ఐదు రోజులలో మంగన్ జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.  లాచెన్,  లాచుంగ్ లోయలలో ప్రతికూల వాతావరణం కారణంగా  గత రెండు రోజులుగా  Mi-17 హెలికాప్టర్లతో  రెస్క్యూ,  రిలీఫ్ కార్యకలాపాలను నిర్వహించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని భారత వైమానిక దళం వెల్లడించింది. వాతావరణం అనుకూలిస్తే నేడు ఏరియల్ రెస్క్యూ ఆపరేషన్‌లు తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపింది. 

రూ. 44 కోట్లు విడుదల
రాష్ట్రానికి మరోవైపు చుంగ్‌తాంగ్‌ డ్యామ్‌  తెగిపోవడానికి గత ప్రభుత్వాలు నాసిరకంగా నిర్మించడమే కారణమని ఆరోపించారు. చుంగుతాంగ్ డ్యామ్‌ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదని, ఈ కారణంగానే డ్యామ్ కొట్టుకుపోయి ఇంతటి విపత్తుకు దారి తీసిందని తెలిపారు. ఇక వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్డి‌డీర్‌ఎఫ్) కేంద్ర వాటా నుంచి ముందస్తుగా ₹ 44.8 కోట్ల విడుదలకు హోం మంత్రి అమిత్ షా ఆమోదం తెలిపారు. ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టాన్ని అంచనా వేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (IMCT)ని కూడా ఏర్పాటు చేసింది.

మరిన్ని వార్తలు