ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం

25 Apr, 2021 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం చాలా మంది కరోనా వైరస్ పేషెంట్లు ఆక్సిజన్ సరైన సమయానికి అందక చనిపోతున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ తగినంతగా సరిపోవడం లేదు. అందుకే విదేశాల నుంచి యుద్ద విమానాల ద్వారా కేంద్రం ఆక్సిజన్ తీసుకొస్తుంది. ఇలాంటి తరుణంలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం కేర్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

వీటిని సాంకేతికంగా ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (PSA) మెడికల్ ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్స్ అని పిలుస్తున్నారు. "ఈ ప్లాంట్లను వీలైనంత త్వరగా నిర్మించాలని పీఏం ఆదేశించారు. ఈ ప్లాంట్ల వల్ల జిల్లా స్థాయిలో పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని" ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాంట్లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తుంది. ప్రతి జిల్లాలో అధికారులు గుర్తించిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

దీని వల్ల జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆకస్మికంగా ఆక్సిజన్ కొరత అనేది ఏర్పడదు. అలాగే, కోవిడ్ -19 రోగులకు, ఇతర రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ ఇక్కడే ఉత్పత్తి అవుతుందని పీఏంఓ తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ సంవత్సరం అదనంగా 162 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చెయ్యడానికి పీఎం-కేర్స్ ఫండ్ నుంచి కేంద్రం రూ.201.58 కోట్లు కేంద్రం కేటాయించింది. దేశంలో ఇప్పటికే చాలా ఆస్పత్రుల్లో ఒక్కసారిగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీనితో ఆక్సిజన్ నిల్వలు ఒక్కసారిగా అయిపోయాయి. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ మెడికల్ ఆక్సిజన్ లేని కారణంగా ఆదివారం నుంచి పేషెంట్లను చేర్చుకోవడం మానేసింది. దీనిపై అధికారులకు చర్చలు జరుపుతున్నారు.

చదవండి: ప్రాణవాయువును అడ్డుకుంటే ఉరి తీస్తాం!

మరిన్ని వార్తలు