నితీశ్‌ కేబినెట్‌లో 57% మంది నేరచరితులే

19 Nov, 2020 04:33 IST|Sakshi

ఏడీఆర్‌ నివేదిక వెల్లడి

మేవాలాల్‌కు విద్యాశాఖ ఇవ్వడంపై రాజకీయ దుమారం

పట్నా: బిహార్‌లో నితీశ్‌కుమార్‌ సర్కార్‌ ప్రమాణ స్వీకారం చేసిందో లేదో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరచరిత కలిగిన వారికి నితీశ్‌ కేబినెట్‌లో చోటు దక్కడంతో విపక్షాలు దాడికి దిగాయి. విద్యాశాఖ మంత్రిగా జేడీ(యూ)కి చెందిన మేవాలాల్‌ చౌధురిని నియమించడంతో రగడ మొదలైంది. గతంలో వ్యవసాయ యూనివ ర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా మేవాలాల్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంతో విపక్ష ఆర్జేడీ కూటమికి ఒక ఆయుధం దొరికింది.

కేబినెట్‌లో మరో ఏడుగురు నేర చరిత కలిగిన వారు ఉన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తాజా నివేదిక వెల్లడించింది. నితీశ్‌ కేబినెట్‌లో బెర్త్‌ సంపాదించిన 14 మంది ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలను విశ్లేషించిన ఆ సంస్థ ఎనిమిది మంది (57%) నేరచరిత్ర కలిగినవారని పేర్కొంది. వారిలో ఆరుగురు (43%)అత్యంత తీవ్రమైన క్రిమినల్‌ కేసుల్ని ఎదుర్కొంటున్నారు. ఎనిమిది మంది కళంకిత మంత్రుల్లో బీజేపీ నుంచి నలుగురు, జేడీ(యూ) నుంచి ఇద్దరు కాగా మిగతా ఇద్దరు కూటమి పార్టీలకు చెందినవారు.

మరిన్ని వార్తలు