24 గంటల్లో 57,937 మంది రికవరీ

19 Aug, 2020 03:57 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 57,937 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,77,779కు చేరుకుంది. మరో వైపు కొత్తగా 55,079 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 27,02,742కు చేరుకుంది. గత 24 గంటల్లో 57,937 మంది కోలుకోగా, 876 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 51,797 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా  యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,73,166 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24.91 శాతంగా ఉంది.

దేశంలో కరోనా రికవరీ రేటు 73.18 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.92 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజాగా దేశవ్యాప్తంగా సంభవించిన 876 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 228 మంది మరణించారు.  ఆగస్టు 17 వరకు 3,09,41,264 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకూ జరిగిన పరీక్షల్లో 7.72 శాతం పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం రికార్డు స్థాయిలో 8,99,864 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగుతున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,476 ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది.

కోలుకున్న వారే ఎక్కువ..
దేశంలో కరోనా వ్యాప్తి, దాన్ని అరికట్టడంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ మంగళవారం పలు విషయాలను వెల్లడించారు. ఏప్రిల్‌లో 7.35 శాతంగా ఉన్న రికవరీ శాతం ప్రస్తుతం 73.18కి చేరినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతమున్న యాక్టివ్‌ కేసులతో పోలిస్తే 2.93 రెట్లు కోలుకున్న వారు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 7 నుంచి 8 లక్షల పరీక్షలు చేస్తున్నారని, దానివల్ల పాజిటివిటీ రేటు గతంలో ఉన్న 10.03 శాతంతో పోలిస్తే 7.72కు దిగి వచ్చిందన్నారు. మరణాల రేటు కూడా భారీగా తగ్గిందన్నారు. పరీక్షలతో వ్యాధిని ముందే గుర్తించి అరికట్టవచ్చని తెలిపారు.

ఆ వైరస్‌ ప్రమాదకారి కాదు
అమెరికా, యూరప్, మలేసియా సహా ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనుగొన్న కరోనా వైరస్‌లో కొత్త రకం డీ614జీతో ప్రమాదకరమైంది కాదని నిపుణులంటున్నారు. జన్యు మార్పులు జరిగిన ఈ వైరస్‌ 10 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతున్నా ఆరోగ్యానికి పెద్దగా హాని జరగదని, ప్రాణాలకు ముప్పు తక్కువని అంటున్నారు. ఈ కొత్త వైరస్‌ వ్యాప్తి వల్ల మరణాల రేటు తగ్గిపోవడం చూశామని ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ ఇంటర్నేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు పాల్‌ తంబియా అన్నారు.  

మరిన్ని వార్తలు