భారత్‌లో మూడు నెలల్లో 5జీ సిద్ధం

11 Mar, 2021 13:49 IST|Sakshi

న్యూఢిల్లీ: 5జీ నెట్‌వర్క్‌ను మూడు నెలల్లోనే అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాలపరమైన సమస్యలు.. అడ్డంకులుగా ఉంటున్నాయి. టెక్నాలజీకి కీలకమైన ఆప్టికల్‌ ఫైబర్‌ ఆధారిత ఇన్‌ఫ్రా ఇంకా సిద్ధంగా లేనందున.. కొన్ని ప్రాంతాలకు మాత్రమే 5జీ నెట్‌వర్క్‌ను పరిమితం చేయాల్సి వస్తుందని టెలికం పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై భారత్‌ సత్వరం నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే కొత్త తరం టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోలేకపోవచ్చని నోకియా ఇండియా హెడ్‌ (మార్కెటింగ్‌) అమిత్‌ మార్వా తెలిపారు. ‘5జీ అనేది ఆపరేటర్లు సొమ్ము చేసుకునేందుకు మరో మార్గంగా భావించరాదు. దేశానికి, ప్రపంచానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రస్తుతం ఇది ఎంతో అవసరం. భారత్‌లో 5జీ తయారు చేస్తున్నాం. హార్డ్‌వేర్‌ సిద్ధంగా ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మూడు నెలల్లోనే భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌లను వినియోగంలోకి తేవడం మొదలుపెట్టొచ్చు‘ అని ఆయన చెప్పారు. 

కొత్త టెక్నాలజీలకు భారీ వ్యయాలు.. 
కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాలంటే భారత్‌లో చాలా వ్యయాలతో కూడుకున్న వ్యవహారమని టెలికం ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సందీప్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇక్కడ రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అటు చైనాలో చూస్తే కొత్త టెక్నాలజీను అభివృద్ధి చేసేందుకు స్థానిక కంపెనీలకు దాదాపు 200 బిలియన్‌ డాలర్ల దాకా ప్రభుత్వమే సమకూరుస్తోందని ఆయన వివరించారు. మరోవైపు, భారత్‌ టెక్నాలజీలను పూర్తి స్థాయిలో రూపొందించే పరిస్థితి లేదని, మిగతా వారి నుంచి కూడా మద్దతు తీసుకోవాల్సిన ఉంటోందని టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సీఈవో అరవింద్‌ బాలి  తెలిపారు. 

మరిన్ని వార్తలు