దారుణం: ఆక్సిజన్‌ అందక ఆరుగురు మృతి

19 Apr, 2021 17:08 IST|Sakshi

షాహ్‌దోల్‌: మధ్యప్రదేశ్‌లోని షాహ్‌దోల్‌లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా కొరత కారణంగా ఆరుగురు కరోనా రోగులు మృత్యు వాతపడ్డారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వేకువజాము మధ్యన ఈ దుర్జటన చోటు చేసుకుంది. ఐసీయూలో తగినంత ఒత్తిడితో ఆక్సిజన్‌ సరఫరా కాకపోవడంతో ఊపిరి అందక ఈ అరుగురు మృతి చెందారని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి డీన్‌ డాక్టర్‌ మిలింద్‌ షిరాల్కర్‌ ఆదివారం తెలిపారు. 

ఐసీయూలో మొత్తం 62 మంది పేషెంట్లు ఉండగా... మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని వివరించారు. శనివారం సాయంత్రం నుంచే ఆక్సిజన్‌ నిల్వలు తగ్గిపోవడంతో పదేపదే సరఫరా దారులను సంప్రదించామని, అర్ధరాత్రికి గాని ఆక్సిజన్‌ సిలిండర్లు రాలేదని తెలిపారు. అయితే షాహ్‌దోల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యేంద్ర సింగ్‌ మాట్లాడుతూ... పరిస్థితి విషమించే ఈ ఆరుగురు మరణించారని అన్నారు. ఒకవేళ ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే మిగతా పేషెంట్లు కూడా ఇబ్బంది పడాలి కదా? అని ప్రశ్నించారు. 

చదవండి: 

లాక్‌డౌన్ పై నిర్మలా సీతారామన్ మరోసారి క్లారిటీ

మరిన్ని వార్తలు