Video: బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల చిన్నారి.. 5 గంటలు శ్రమించి..

10 Jan, 2023 19:36 IST|Sakshi

బోరు బావులు చిన్నారుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల  తెరిచి ఉంచిన బోరు బావిలో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హాపూర్‌ జిల్లాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. స్థానికంగా నివసిస్తున్న మావియా అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ  60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. జిల్లా లోని కోట్ల సాదత్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగింది.

బావిలో నుంచి బాలుడి అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులు అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు చిన్నారిని కాపాడేందుకుసహాయక చర్యలు ప్రారంభించాయి. ముందుగా ఆక్సిజన్‌ను బోరుబావిలోకి పంపించారు. 5 గంటలు తీవ్రంగా శ్రమించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.. చివరికి బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. రెస్క్యూ ఆపరేషన్‌లో బాలుడికి స్వల్ప గాయాలు కాగా.. అతడు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా  ఈ ఘటనతో స్థానికంగా ఒక్కసారిగా  భయాందోళనలు నెలకొన్నాయి. అయితే ఈ బోరు బావి హాపూర్‌ మున్సిపాలిటీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం దీనిని తవ్విందని, చాలాకాలంగా ఇది నిరుపయోగంగా ఉందని తెలిపారు. సుమారు 35 ఏళ్ళ క్రితం ఈ బోరు బావిని తవ్వారని పేర్కొన్నారు.
చదవండి: Honey Trap: సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ.. వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్..

>
మరిన్ని వార్తలు