వైరల్‌: మోదీ సార్‌.. మాకెందుకీ కష్టాలు

31 May, 2021 20:50 IST|Sakshi
వీడియో దృశ్యాలు

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే స్కూళ్లు, కాలేజీలు ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. చదువులన్నీ చాలా వరకు ఆన్‌లైన్‌ బాట పట్టాయి. దీంతో పిల్లలు ఇష్టం లేకపోయినా.. చాలా కష్టపడి చదువుతున్నారు. ఆన్‌లైన్‌ చదువులతో విసిగెత్తిపోతున్నారు. కంటికి కనిపించని శత్రువుతో పోరాడలేక, ఆన్‌లైన్‌ చదువులతో వేగ లేక.. ఈ ఆన్‌లైన్‌ చదువులు మాకు వద్దు తండ్రో అని ఇంట్లో గట్టిగా అరిచి చెప్పలేక అల్లాడిపోతున్నారు. కానీ, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ ఆరేళ్ల బాలిక మాత్రం ఇందుకు భిన్నంగా ఆన్‌లైన్‌ చదువులపై తనకున్న అసహనాన్ని గట్టిగానే వెల్లగిక్కింది.

తన బాధను దేశ ప్రధాని నరేంద్ర మోదీతో మొరపెట్టుకుంది. ఆన్‌లైన్‌ తరగతులు, అతి స్కూల్‌ వర్క్‌పై ఆయనకు వీడియో ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలో ‘‘ మాకు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతారు. ఇంగ్లీష్‌, లెక్కలు, ఉర్థూ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌.. వాటితో పాటు కంప్యూటర్‌ క్లాసులు కూడా ఉన్నాయి. పిల్లలకు చాలా పని పెరిగిపోయింది. మేము అంత కష్టపడటం అవసరమా మోదీ సార్‌!.. ఏం చేద్దాం అంటారు?’’ అని పేర్కొంది. 42 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి ముద్దు ముద్దు మాటలకు నెటిజనులు ఫిదా అవుతున్నారు.

మరిన్ని వార్తలు