భలే దొంగలు...ఏకంగా 60 అడుగుల బ్రిడ్జినే...

9 Apr, 2022 15:23 IST|Sakshi

Thieves Stolen 60 Feet Steel Bridge: ఇటీవల దొంగతనానికి వచ్చి గోడ కన్నంలో ఇరుక్కుపోయిన ఘటన గురించి విన్నాం. బంగారం, డబ్బులు, ఇంట్లో ఫర్నిచర్‌ వంటివి ఎత్తుకుపోవడం గురించి విన్నాం. కానీ అసాధ్యమైనవి, అలాంటివి కూడా ఎత్తుకుపోతారా అనిపించే వాటిని ఒక దొంగల ముఠా పక్కా ప్లాన్‌తో ఎత్తుకుపోయింది. పైగా స్థానికుల సాయంతో దర్జాగా పట్టుకెళ్లిపోయింది.

వివరాల్లోకెళ్తే...బిహార్‌లోని రోహతాస్ జిల్లాలో పట్టపగలు 60 అడుగుల వంతెనను దొంగలించారు. అసలెవరూ ఊహించని విధంగా అసాధారణమైన దాన్ని ఎత్తుకెళ్లిపోయారు. పోలీసుల కథనం ప్రకారం...అమియావర్ గ్రామం వద్ద 1972లో అర్రా కాలువపై వంతెన నిర్మించారు. ఇది ఇప్పుడూ చాలా పాతది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. అయితే స్థానిక గ్రామస్తులు ప్రస్తుతం ఈ వంతెనను వినియోగించడంలేదు. ఈ మేరకు ఒక దొంగల ముఠా నీటి పారుదల శాఖ అధికారులుగా  ఆ గ్రామంలోని స్థానికులకు పరిచయం చేసుకున్నారు.

ఆ వంతెనను కూల్చివేస్తున్నామని చెప్పడమే కాకుండా గ్రామస్తుల సాయం కూడా తీసుకున్నారు. ఆ వంతెన ఉక్కుతో కూడిన నిర్మాణం. ఆ ముఠా గ్యాస్ కట్టర్లు, ఎర్త్‌మూవర్ యంత్రాలను ఉపయోగించి వంతెనను కూల్చివేసి, మూడు రోజుల్లో మొత్తం మెటల్‌ని స్వాహా చేశారు.  దీంతో నీటి పారుదల శాఖ అధికారుల అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చోరీ పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఘటనస్థలికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ వంతెన 60 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. గతంలో ఇలాంటి ఘటనలు చెక్‌ రిపబ్లిక్‌, యూఎస్‌లోని పెన్సిల్వేనియా, ఉక్రెయిన్‌ వంటి దేశాల్లో చోటు చేసుకున్నాయి. ఏదిఏమైన దొంగలకు కూడా రొటిన్‌గా చేసే దొంగతనాలు పై బోర్‌ కొట్టిందో ఏమో ఇలా వైరైటీగా దొంగతనం చేయాలనుకున్నారు కాబోలు.

(చదవండి: ఏ క్షణంలోనైనా మీ ప్రాణాలు పోవచ్చు.. మాజీ సీఎంలకు వార్నింగ్‌)

మరిన్ని వార్తలు