ఏప్రిల్‌–మేలో 645 మంది చిన్నారులు అనాథలయ్యారు

23 Jul, 2021 07:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌లో ఏప్రిల్‌ 1 నుంచి మే 28 తేదీ వరకు 645 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. రాజ్యసభలో గురువారం ఒక ప్రశ్నకు సమాధానంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని తెలిపా రు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 158 పిల్లలు అనాథలుగా మారారని, తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో 119 మంది, మహారాష్ట్రలో 83, మధ్యప్రదేశ్‌లో 73 మంది చిన్నారులు అనాథలు అయ్యారని వివరించారు. తల్లిదండ్రుల్లో ఇద్దరినీ కోల్పోవడమో, బతికున్న ఒక్కరినీ కోల్పో వడం లేదా సంరక్షకులను కోల్పోవడం జరిగిం దని తెలిపారు.

ఇలాంటి పిల్లల కోసం వారికి 18 ఏళ్లు నిండేసరికి రూ. 10 లక్షల మూలధన నిధి ఉండేలా (వారి పేరిట బ్యాంకుల్లో) ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 18 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వరకు వీరికి దీనిపై వచ్చే వడ్డీతో నెలనెలా స్టైపెండ్‌ అందుతుందని, ఉన్నత విద్యకు, స్వంత అవసరాలకు ఇది ఉపయోగపడుతుందని ఇరానీ తెలిపారు. 23 ఏళ్లు నిండాక మూలధన నిధి రూ. 10 లక్షలను ఒకేసారి వారికి ఇచ్చేస్తారన్నారు.
 

మరిన్ని వార్తలు