వృద్ధుడి సైకిల్‌ సందేశం.. మూడు నెలల్లో 7వేల కిలోమీటర్ల ప్రయాణం!

6 Jan, 2022 16:49 IST|Sakshi

బరంపురం/ఒడిశా: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నగరానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు సాహసయాత్రకు సిద్ధమయ్యాడు. స్థానిక కాపువీధికి చెందిన ఎ.కృష్ట్రారావు బరంపురం నుంచి రామేశ్వరం–అయోధ్య మీదు గా దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాల్లో సైకిల్‌యాత్ర చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక ఫ్రెండ్స్‌ వెల్ఫేర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో బరంపురం గ్రామదేవత మాబుడి శాంతమ్మ ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న ఆయన.. స్థానిక పాతబస్టాండ్‌ ప్రాంగణంలో సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఆశాంతి, అహింస రోజురోజుకీ పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు.

మనుషుల మధ్య అంతరాలు ఏర్పడి, దేశాలు, ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. వైషమ్యాలు తొలగిపోయి, అంతా ప్రశాంతంగా మెలగాలని ఆకాంక్షిస్తూ సైకిల్‌యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బరంపురం, రామేశ్వరం, అయోధ్య ప్రాంతాలను చుట్టి వస్తూ చివరగా పూరీ జగన్నాథుని దర్శించుకోనున్నట్లు ప్రకటించారు. సగటున రోజూ 100 కిలోమీటర్లు చొప్పున మూడు నెలల్లో 7వేల కిలోమీటర్లు సైకిల్‌పై చుట్టి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు ఆకాంక్ష నెరవేరాలంటూ స్థానికులు ఆయనను ఉత్సాహ పరిచి, సాగనంపారు.

చదవండి: భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం..

మరిన్ని వార్తలు