డేంజరస్‌ డెల్టా ప్లస్‌.. 66 మందిలో నిర్ధారణ, ఐదుగురి మృతి 

15 Aug, 2021 03:27 IST|Sakshi

పంజా విసురుతున్న డెల్టా ప్లస్‌ వేరియంట్‌ 

ఇప్పటివరకు 66 మందిలో నిర్ధారణ.. ఐదుగురి మృతి 

సాక్షి, ముంబై: రాష్ట్రంపై దాడి చేసేందుకు కరోనా మహమ్మారి మరో రూపంలో సిద్ధమైంది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ రూపంలో పంజా విసరడం మొదలు పెట్టింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 66 మందికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ కాగా.. అందులో అయిదుగురు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. నమోదైన 66 డెల్టా ప్లస్‌ కేసుల్లో అత్యధికంగా జల్‌గావ్‌ జిల్లాలో 13 కేసులున్నాయి. డెల్టా ప్లస్‌ కేసులలో జల్‌గావ్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, రత్నగిరి జిల్లాలో 12 కేసులున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 11 మందికి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిందని తేలింది. అయితే ఈ 66 మందిలో 32 మందిపై వైరస్‌ ప్రభావం అంతగా లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, మిగతావారిలో 18 ఏళ్ల లోపు వయసు వారు కూడా ఉన్నారు. దీంతో అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

మరోవైపు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్‌లాక్‌ 3.0లో భాగంగా పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆంక్షలు సడలిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ విస్తరణపై ఎలా ప్రభావం చూపనుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా, డెల్టా ప్లస్‌ ముప్పు పొంచి ఉందని, ఈ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ కచ్చితంగా నియమాలను పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అతివేగంగా వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రెండు డోసులు తప్పనిసరి 
డెల్టా ప్లస్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులు కరోనా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలని నియమం పెట్టింది. టీకా రెండు డోసులు తీసుకోనివారు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకొని నెగెటివ్‌ రిపోర్టు చూపించడం తప్పనిసరి చేసింది. ఈ రెండు నియమాలను పాటించకపోతే 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందని స్పష్టం చేసింది. 

ఆగస్టు 15 నుంచి వర్తించే సడలింపులు 
మాల్స్, రెస్టారెంట్స్‌ 50 శాతం సామర్థ్యంతో రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే, సిబ్బందికి వ్యాక్సినేషన్‌ పూర్తయి ఉండాలని షరతును పెట్టింది. 
షాపులు కూడా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. 
స్పా, జిమ్‌లు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10 గంటల వరకు నడిపేందుకు పలు షరతులతో అనుమతించింది. 
బహిరంగ ప్రాంతాల్లో జరిగే వివాహ వేడుకలకు ఇకపై 200 మందిని అనుమతించనున్నారు. హాళ్లలో జరిగే కార్యక్రమాలకు స్థలాన్ని బట్టి 50 మందిని లేదా 100 మందిని అనుమతించనున్నారు. 
ఇండోర్‌ క్రీడలకు అనుమతి లభించింది. 
సినిమా హాళ్లు, ప్రార్థనా స్థలాలు మాత్రం తదుపరి ఆదేశాల వరకు మూసి ఉండనున్నాయి. 
ఇన్నాళ్లు లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు సామాన్యులకు అనుమతి ఉండేది కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసర విభాగాల్లో పనిచేసే వారిని మాత్రమే అనుమతించారు. కానీ, కరోనా టీకా రెండు డోసులు తీసుకుని 14 రోజులు పూర్తయినవారిని ఇకపై లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కూడా ప్రకటన చేయడంతో రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తయిన ప్రయాణికులకు పాసులు కూడా జారీ చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు