Deshna Nahar: లింబో స్కేటింగ్‌లో ఏడేళ్ల చిన్నారి ‘గిన్నిస్‌ రికార్డ్‌’

2 Aug, 2022 19:41 IST|Sakshi

ముంబై: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు ఈ చిన్నారి సరిగ్గా సరిపోతుంది. చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఆమెనే మహారాష్ట్ర, పుణెకు చెందిన ఏడేళ్ల చిన్నారి దేశ్నా ఆదిత్య నాహర్‌. లింబో స్కేటింగ్‌లో 20 కార్ల కింద నుంచి అత్యంత వేగంగా దూసుకెళ్లి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 193 అడుగుల దూరాన్ని చేరుకునేందుకు 13.74 సెకన్ల సమయం మాత్రమే తీసుకుని అబ్బుర పరిచింది ఈ పాప. గతంలో చైనాకు చెందిన 14 ఏళ్ల బాలిక పేరున ఉన్న 14.15 సెకన్ల రికార్డును తిరగరాసింది. 

లింబో స్కేటింగ్‌ను రోలర్‌ లింబోగా కూడా పిలుస్తారు. అడ్డంగా పెట్టిన పోల్‌ వంటి ఏదైనా వస్తువు కింద నుంచి రోలర్‌ స్కేటింగ్‌ చేసే ఈ ఆటకు చాలా గుర్తింపు ఉంది. 20 కార్ల కింద నుంచి వేగంగా వెళ్తున్న చిన్నారి వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది. ‘ఏప్రిల్‌ 16న మహారాష్ట్ర, పుణెకు చెందిన దేశ్నా ఆదిత్య నాహర్‌ కేవలం 13.74 సెకన్లలోనే 20 కార్ల కింద నుంచి లింబో స్కేట్‌ నిర్వహించింది. ఈ రికార్డ్‌ సాధించేందుకు దిశ్నా సుమారు ఏడాదిన్నరపాటు సాధన చేసింది.’ అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ తన అధికారిక ఖాతాలో రాసుకొచ్చింది.

మరోవైపు.. దుబాయ్‌లోని భారత యోగా టీచర్‌ సుమారు 30 నిమిషాల పాటు ఒకే యోగా పోజ్‌లో ఉండి గిన్నిస్‌ రికార్డ్‌ సాధించారు. ఆ వీడియోను యాష్‌ మాన్సుఖ్‌భాయ్‌ మొరాదియా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో తేలు ఆకారంలో యోగాసనం వేశారు మొరాదియా. 21 ఏళ్ల యోగా టీచర్‌ 29 నిమిషాల 4 సెకన్ల పాటు ఆ యోగాసనంలో ఉండి.. గతంలోని 4 నిమిషాల 47 సెకన్ల రికార్డును తిరగరాశారు.

ఇదీ చదవండి: ఎవరెస్ట్ ఎక్కిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు... గిన్నిస్ రికార్డు తండ్రికి అంకితం

మరిన్ని వార్తలు