71వ ఏట రెండో పెళ్లి.. కూతురు కామెంట్స్‌ వైరల్‌

28 Apr, 2021 20:32 IST|Sakshi

వితంతు పునర్వివాహం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజనులు

ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో.. తోడుగా మరో మనిషి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత చరమాంకంలో మనిషికి తోడు ఎంతో అవసరం. బాధ్యతలు తీరి.. సంతానం వారి జీవితాల్లో బిజీగా ఉన్న వేళ భార్యభర్తలిద్దరు ఒకరికి ఒకరు తోడునీడగా నిలుస్తారు. మలి సంధ్యవేళ దంపతుల్లో ఎవరు ముందుగా ఈ లోకం వీడినా మిగతా వారి జీవితం శూన్యం అయిపోతుంది. ఆ వెలితిని ఎవరూ పూడ్చలేరు.. ఒక్క జీవిత భాగస్వామి తప్ప. ఒకప్పుడు అంటే మధ్యవయసులో పునర్వివాహం గురించి ఆలోచించాలంటే సమాజానికి జడిసి ఊరుకునేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. వయసుతో సంబంధం లేకుండా రెండో వివాహానికి సిద్ధపడుతున్నారు. సమాజం సంగతి ఎలా ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం వీరికి మద్దతిస్తున్నారు.

తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య చనిపోయిన 71 ఏళ్ల వృద్ధుడు.. ఓ వితంతు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని సదరు వృద్దుడి కుమార్తె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో తెగ వైరలవుతోంది. నెటిజనులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సదరు వృద్ధుడి భార్య ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వృద్ధుడి కుమార్తె అదితి తన తండ్రిని మళ్లీ పెళ్లి చేసుకోమని చాలా సార్లు కోరింది. మొదట్లో దాటవేస్తూ వచ్చిన సదరు వృద్ధుడు చివరకు ఐదు సంవత్సరాల తర్వాత రెండో వివాహానికి అంగీకరించాడు. మరో వితంతు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 27న వీరి వివాహం జరిగింది.

ఈ సందర్భంగా అదితి తన తండ్రి రెండో వివాహానికి సంబంధించిన ఫోటో షేర్‌ చేస్తూ.. ‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. పునర్విహానికి సంబంధించి మన దేశంలో నిర్దుష్ట చట్టాలు ఏం లేవు. కొందరు మహిళలు మా నాన్న వెంట పడి డబ్బు కోసం దెయ్యాలాగా పీడించడం చూశాను. చివరకు ఆయన పునర్వివాహం చేసుకున్నారు. సమాజం వారిని ఆశీర్వదించి.. అక్కున చేర్చుకుంటుందా.. లేదా అనేది తెలియదు. కానీ నా తండ్రి ఒంటరిగా ఉండటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు’’ అంటూ ట్వీట్‌ చేసింది. 

దీనిపై నెటిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చివరి దశలో ఉన్నప్పుడు తోడు చాలా అవసరం. మీరు చాలా మంచి పని చేశారు. కంగ్రాట్స్‌’’.. ‘‘ఇంత మంచి న్యూస్‌ షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు’’.. ‘‘కొత్త​ ఇంటికి మీ అమ్మను ఆహ్వానించండి. వారిద్దరు ఒకరికొకరు కొత్త జీవితాన్ని ఇచ్చుకున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రకారం వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు.. అంతకు మించి ఎంతో విలువైనది. వీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.. తోడు, నీడగా నిలుస్తారు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు.  

చదవండి: తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు: హై కోర్టు

మరిన్ని వార్తలు