74th Republic Day: గణతంత్ర పరేడ్‌లో... స్వదేశీ వెలుగులు

26 Jan, 2023 04:07 IST|Sakshi

గర్జించనున్న మేడిన్‌ ఇండియా ఆయుధాలు

తొలిసారి స్వదేశీ తుపాకులతో గౌరవ వందనం

74వ గణతంత్ర వేడుకలు స్వదేశీ వెలుగులతో మెరవనున్నాయి. సంప్రదాయ గౌరవ వందనంలో బ్రిటిష్‌ కాలపు 25–పౌండర్‌ గన్స్‌ స్థానంలో స్వదేశీ 105 ఎంఎం తుపాకులు సగర్వంగా గర్జించనున్నాయి. పరేడ్‌లో ప్రదర్శించే ఆయుధాలన్నీ మన దేశంలో తయారైనవే!

బ్రిటన్‌ వలస పాలన నీడల నుంచి బయటపడి పూర్తిగా భారతీయత ఉట్టిపడేలా ఆత్మనిర్భర్‌ భారత్‌ సత్తాను సగర్వంగా చాటేలా గణతంత్ర వేడుకలను జరిపేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. చైనాతో ఉద్రిక్తతల వేళ మన సాయుధ సత్తాను చాటడానికి కవాతులో మేడిన్‌ ఇండియా ఆయుధాలను ప్రదర్శించబోతున్నారు. ఇండిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని, ఆకాశ్, నాగ్‌ క్షిపణులతో పాటు బ్రహ్మోస్, అర్జున్‌ యుద్ధ ట్యాంకులు, ప్రచండ హెలికాప్టర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి...

బ్రహ్మోస్‌
ప్రపంచంలో మొట్టమొదటి సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి. భారత రక్షణ అభివృద్ధి పరిశోధన రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన బ్రహ్మోస్‌ను విమానాలు, నౌకలు, జలాంతర్గాములు, భూ ఉపరితలం... ఇలా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు. ధ్వని కంటే మూడు రెట్లు వేగంతో ప్రయాణించగలదు. వంద శాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్షిపణిగా గుర్తింపు పొందింది. శత్రు దేశాల రాడార్‌ల నుంచి కూడా సులభంగా తప్పించుకోగల ఈ క్షిపణి శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

అగ్ని
దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆధ్వర్యంలో అభివృద్ది చేసిన క్షిపణి. కాలక్రమేణా ఆధునిక సాంకేతితతో రూపు మార్చుకుంటూ వచ్చింది. అగ్ని 5 వెర్షన్లను రూపొందించిన తర్వాత ఇటీవల అణ్వాయుధ సామర్థ్యంతో అగ్ని ప్రైమ్‌ ఖండాంతర క్షిపణిని తయారు చేశారు. 2 వేల కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.

అర్జున్‌
ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్‌ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్‌ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది.

ప్రచండ
ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మోహరించగలిగే తేలికపాటి హెలికాప్టర్‌. హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) అభివృద్ధి చేసింది. సముద్రమట్టానికి 16,400 అడుగుల ఎత్తులో అలవోకగా టేకాఫ్, ల్యాండింగ్‌ ప్రత్యేకత. దీనితో రెండు శక్తిమంతమైన ఇంజిన్లు, అత్యంత ఆధునిక సౌకర్యాలుంటాయి. రాత్రి పూట కొండల మధ్య ప్రయాణించగలిగే సత్తాతో పాటు నిమిషానికి 800 రౌండ్లు కాల్పులు జరిపే సామర్థ్యముంది. చైనా డ్రోన్లను కూడా కూల్చివేయగలవు. నేలపై ఉన్న ట్యాంకర్లను సైతం ధ్వంసం చేయగలవు.

ఆకాశ్‌
ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్‌ తొలి క్షిపణి ఆకాశ్‌. భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ. దూరంలోని లక్ష్యాలను కచ్చితంగా ఛేదించగలదు. 95% పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇందుకు పాతికేళ్లు పట్టింది. 2014లో వైమానిక దళానికి, 2015లో ఆర్మీకి అందజేశారు. వీటిని విదేశాలకు విక్రయించడానికీ సన్నాహాలు జరుగుతున్నాయి.

కే–9 వజ్ర
స్వీయ
చోదక శతఘ్ని వ్యవస్థ. 2018లో తొలిసారిగా ఆర్మీకి అందజేశారు. మైదాన ప్రాంతాల్లో అత్యంత సమర్థంగా పని చేస్తుంది. ప్రస్తుతం లద్ధాఖ్‌ సరిహద్దుల్లో మోహరించారు. 155 ఎంఎం కెనాన్‌ కలిగిన ఈ శతఘ్ని 18 నుంచి 52 కి.మీ. దూరం దాకా గుళ్ల వర్షం కురిపించగలదు. దీనికున్న అత్యంత శక్తిమంతమైన ఇంజిన్‌  గంటకి 67 కి.మీ. వేగంతో పని చేస్తుంది.

అర్జున్‌
ఈ యుద్ధ ట్యాంకు సరిహద్దుల్ని కాపుకాసే విశ్వసనీయమైన నేస్తం. 2011లో మన అమ్ముల పొదిలో చేరింది. దీని ఫీచర్లను మరింత ఆధునీకరించి అర్జున్‌ ఎంకే1ఏను అభివృద్ధి చేశారు. రాత్రిళ్లూ సమాన సామర్థ్యంతో పని చేయడం దీని ప్రత్యేకత. బరువు తక్కువ కావడంతో మైదాన, కొండ ప్రాంతాల్లో ఒకేలా కదలగలవు. చెన్నైలోని హెవీ వెలిహల్స్‌ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేసింది.

రక్షణ రంగానికి స్వదేశీ హంగులు
ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టాక రక్షణ రంగంలో స్వావలంబనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయుధాల కోసం విదేశాల మీద ఆధారపడటం తగ్గించి దేశీయంగా తయారు చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. రష్యా వంటి దేశాల సాంకేతిక సహకారంతో దేశీయంగా ఆయుధాల ఉత్పత్తి ముమ్మరమైంది. 2021లో సాయుధ బలగాలు తమకు కేటాయించిన నిధుల్లో 64% స్వదేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు వినియోగిస్తే గతేడాది 68% నిధులు వినియోగించాయి. ఆర్మీ అత్యధికంగా 72% నిధులను మేడిన్‌ ఇండియా ఆయుధాలపైనే వెచ్చించింది. దేశీయంగా రక్షణ పరికరాల ఉత్పత్తి విలువను 2025 కల్లా 2,500 కోట్ల డాలర్లకు తీసుకువెళ్లే లక్ష్యం దిశగానూ వడివడిగా అడుగులు పడుతున్నాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు