సదుపాయాలతో వందే భారత్‌ రైళ్లు

21 Aug, 2021 06:33 IST|Sakshi

న్యూఢిల్లీ: 75 సంవత్సరాల అమృత్‌ మహోత్సవం సందర్భంగా 75 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు 75 వారాల్లోగా దేశంలోని ప్రతి మూలను కలుపుతాయని అధికారులు వెల్లడించారు. దీని గురించి ప్రధాని మోదీ ఆగస్టు 15న తన ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటికే రెండు వందే భారత్‌ రైళ్లు తిరుగుతున్నాయి. వారణాసి–ఢిల్లీ, కాట్ర–ఢిల్లీల మధ్య ఈ రైళ్లు తిరుగుతున్నాయి. రానున్న కొత్త రైళ్లలో ఉండే ప్రత్యేక సదుపాయాల గురించి అధికారులు వెల్లడించారు.

అత్యవసర సమయాల్లో వేగంగా బయటకు వెళ్లేందుకు నాలుగు ఎమర్జెన్సీ విండోలతో పాటు, నాలుగు డిజాస్టర్‌ లైట్లను కూడా ప్రతీ కోచ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఎమర్జెన్సీ పుష్‌ బటన్‌ల సంఖ్యను కోచ్‌కు రెండు నుంచి నాలుగుకు పెంచనున్నట్లు వెల్లడించారు. మెరుగైన నిర్వహణ కోసం సెంట్రలైజ్డ్‌ కోచ్‌ మానిటరింగ్‌సిస్టం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోచ్‌లలో ఉపయోగించే వైర్లను ఫైర్‌ప్రూఫ్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏసీ బోగీల్లో గాలి నాణ్యతను పెంచనున్నట్లు ప్రకటించారు. 2022 జూన్‌ నుంచి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు