తీర్చలేని వెలితి.. భరతమాత తొలి వెలుగులకు దూరమైన తెలంగాణ

18 Aug, 2022 17:49 IST|Sakshi

1600 సంవత్సరంలో భారత గడ్డపై వ్యాపార నిమిత్తం కాలు మోపి, ఇంతింతై వటుడింతై అన్నట్లు అంచెలంచెలుగా తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ, భారతీయుల, పాలకుల అమాయకత్వాన్ని తమకు అనువుగా మలచుకొంటూ సాగిన ఈస్ట్ ఇండియా కంపెనీ జైత్రయాత్ర ప్లాసీ యుద్ధం అనంతరం మరింతగా విస్తరించి, బెంగాల్ ప్రాంతాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. 

భారతదేశ స్వయం సిద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రకృతిని కాపాడుకుంటూ సాగే జీవన విధానం, విద్యా వ్యవస్థ మరియు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచే ధార్మిక మూలాలు, వాటి విశిష్టతని అర్థం చేసుకున్న కంపెనీ పాలకులు, వారి వ్యాపార విస్తరణకు అడ్డుగా ఉంటుందన్న భావనతో దేశం మొత్తాన్ని ముందుగా తమ చేతుల్లోకి తీసుకుంది. 

అనంతరం భారతీయ మూలాల్ని పెకిలించే కంపెనీ ప్రక్రియ యథేఛ్చగా సాగడం వల్ల దేశ ప్రజల్లో రాజుకున్న స్వతంత్ర కాంక్ష 1857 లో  సిపాయి రెబెల్లియన్‌గా ,తొలి స్వాతంత్య్ర పోరాటంగా మారడం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం, అఖండ భారత పాలన కేవలం కంపెనీతో సాధ్య పడదని తెలుసుకుని నేరుగా దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది.

భారతీయులకి ఈ స్థితి నేరుగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది. మెల్లిమెల్లిగా రాజుకుంటున్న స్వాతంత్ర కాంక్షని ముందుగానే అంచనా వేసిన బ్రిటిష్ ప్రభుత్వం 1861, 1892, 1909, 1919 లలో  ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్ రూపంలో దేశ ప్రజలకి ఎంగిలి మెతుకుల్ని విదిల్చినట్టు అధికారంలో, పాలనలో తమకు అడ్డు రాకుండా కొద్దిపాటి భాగ స్వామ్యాన్ని కల్పించింది. 

అరకొరగా ఇచ్చిన పాలనా భాగస్వామ్యం ప్రజల్లో పెరుగుతున్న స్వాతంత్య్ర భావనని తగ్గించక పోగా మరింత తీవ్రరూపం దాల్చడంతో ఇండియన్ యాక్ట్ 1935 రూపంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకి పూర్తి పాలన స్వేఛ్చని ఇచ్చినట్లు ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.

అత్యంత దారుణమైన స్థితి ఏంటంటే తమ సోదరులు, మిగిలిన భారతీయులు తమ స్వాతంత్య్రాన్ని చాటుతూ ముందుకు సాగుతుంటే, తెలంగాణ, మరట్వాడ మరియు కల్యాణ కర్ణాటక (ఉత్తర కర్ణాటక ) ప్రాంత వాసులు మాత్రం, 1724 లో మొగలు రాజుల నుండి సొంత జెండా ఎగరవేసిన అసిఫ్ జాహి నిజాం పాలకుల కబంధ హస్తాల్లోకి వెళ్లి, విద్యకి ,వైద్యానికి, చివరికి తమ సంస్కృతి సాంప్రదాయాల్ని, మత స్వేచ్ఛని కోల్పోయి మానవ సమాజంపై జరిగే దాడి నుంచి తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో మునిగి పోయారు.15  ఆగష్టు, 1947, దేశం పూర్తి స్వేచ్చా వాయువుల్ని పీల్చుకునే సమయంలో హైదరాబాద్ సంస్థానం మాత్రం రజాకార్ల రూపంలో ఉన్న మానవ మృగాల పైశాచిక దాడిని ఎదుర్కొంటూ, తమను తాము రక్షించేకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు.

విలాసాలు , వినోదాలతో సాగిన నిజాం పాలన ప్రజల కనీస హక్కులు కాలరాస్తూ సాగి, చివరకి అప్పు కట్టలేక తన రాజ్యాన్ని కొద్ది కొద్దిగా ముక్కలు చేస్తూ, కంపెనీకి , బ్రిటిష్ పాలకులకు అప్పగించే స్థితి దాపురించింది . 1768లో మచిలీపట్టణం సంధి ద్వారా కోస్తా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించిన నిజాం, 1903 లో బేరార్ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకులకి అప్పజెప్పాడు. ఇదే క్రమంలో సీడెడ్ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. 

జులై 4 1946  వరంగల్ జిల్లాలోని కడవేని గ్రామంలో దొడ్డ కొమరయ్య అనే రైతు హత్య ఘటన, నిజాం అనుచరులైన దొరలపై రైతుల తిరుగుబాటుకి దారి తీసింది. రజాకార్ల పైన ఆత్మ రక్షణ యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా ఏకమై, కుల సంఘాలు, వామపక్షాలు, రైతులు, విద్యావంతులు గెరిల్లా యుద్దాన్ని చేబట్టారు. 

గోండు జాతిని రక్షించే బాధ్యత, 1900-1949 సమయంలో కొమరం భీంపై పడి, జమిందార్ లక్ష్మణ్ రావు దాష్టికాలపై, నిజాంపై 1900-1949 మధ్య కాలంలో సాగిన అస్తిత్వ పోరాటం..‘జల్, జంగిల్ జమీన్’ నినాదంతో సాగి 1940 లో  భీం ప్రాణాలని హరించింది.

విసునూరు రామ చంద్రా రెడ్డి విశృంఖల దౌర్జన్యానికి, నిజాం దోపిడీ విధానానికి  వ్యతిరేకంగా సాగిన చాకలి ఐలమ్మ పోరాటం మనకి సదా ప్రాతఃస్మరణీయం. ఈ హైదరాబాద్ సంస్థాన వాసుల దయానీయ స్థితిని గమనించిన భారత ప్రభుత్వం, మన ప్రథమ హోం శాఖామాత్యులు, స్వర్గీయ  వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో సాగించిన పోలీస్ ఆక్షన్ 13 సెప్టెంబర్ 1948 లో మొదలై  17 సెప్టెంబర్ 1948న నైజాం దాస్య శృంకలాల నుంచి స్వేఛ్చ వాయువుల్ని పీల్చుకునే వరకు సాగింది.

దేశం ఎన్నో బలిదానాల ఫలితంగా ఏర్పడ్డ స్వాతంత్రం, ఆ మధురమైన అమృత ఘడియలు, ఆ అద్భుత మైన అనుభూతికి దూరంగా, హైదరాబాద్ సంస్థాన వాసులు మాత్రం తీర్చలేని వెలితితో భరతమాత తొలి వెలుగులకు దూరంగా ఉండిపోయింది. దొర్లి పోయిన కాలంలో గాయపడ్డ తెలంగాణ మరకలు అలాగే మిగిలి పోయాయి. 
-వేముల శ్రీకర్, ఐఆర్‌ఎస్‌, కమిషనర్, ఇన్‌కంటాక్స్‌

మరిన్ని వార్తలు