మహోజ్వల భారతి: ‘నల్లదొరతనం’ పై రాయనన్న దేశభక్తుడు

14 Jul, 2022 13:53 IST|Sakshi
గరిమెళ్ల సత్యనారాయణ

సహాయ నిరాకరణోద్యమ స్ఫూర్తితో గరిమెళ్ల సత్యనారాయణ వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఎంతలా జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్‌ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడించుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు.

అంతటి మనిషికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన పాలకుల వల్ల ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు.

స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రబలిన అవినీతికి విసిగి వేసారిన గరిమెళ్ల మిత్రుల్లో కొందరు ఆయనను ‘మాకొద్దీ నల్లదొరతనము..’ అంటూ కొత్త పాట రాయాల్సిందిగా కోరారు. అయితే, నరనరానా దేశభక్తిని జీర్ణించుకున్న ఆయన అందుకు అంగీకరించలేదు. దుర్భర దారిద్య్ర పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 52 ఏళ్ల వయసుకే తుదిశ్వాస విడిచారు. నేడు గరిమెళ్లవారి జయంతి. 1893 జూలై 14న ఆయన శ్రీకాకుళంలోని నరసన్నపేటలో జన్మించారు. 

మరిన్ని వార్తలు