Azadi Ka Amrit Mahotsav: అమృత్‌ సెల్యూట్‌

15 Aug, 2022 05:04 IST|Sakshi

అంబరాన్నంటుతున్న అమృతోత్సవాలు

76వ స్వాతంత్య్ర వేడుకలకు దేశం సిద్ధం

మువ్వన్నెల రెపరెపల నడుమ స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. 76వ స్వాతంత్య్ర దినాతోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు.

అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. అమృతోత్సవాల్లో భాగంగా కేంద్రం చేపట్టిన పలు కార్యక్రమాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా పంద్రాగస్టు జోష్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లాయి. హర్‌ ఘర్‌ తిరంగా పిలుపును ప్రజలంతా ఉద్యమ స్ఫూర్తితో అందిపుచ్చుకున్నారు. దాంతో త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఇల్లూ పండుగ చేసుకుంటోంది.

రెండేళ్లుగా కరోనా కల్లోలం మధ్యే పంద్రాగస్టు వేడుకలు జరిగాయి. దాని పంజా నుంచి బయట పడుతుండటం ఈసారి పంద్రాగస్టు ఉత్సహాన్ని రెట్టింపు చేస్తోంది. పంద్రాగస్టు ప్రసంగంలో కేంద్ర సాఫల్యాలను ప్రస్తావించడంతో పాటు పలు కొత్త పథకాలు ప్రకటించడం మోదీకి ఆనవాయితీగా వస్తోంది. 2021 ప్రసంగంలో గతి శక్తి మాస్టర్‌ప్లాన్, నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ వంటివాటిని ఆయన ప్రకటించారు.

2020లో దేశంలోని 6 లక్షల గ్రామాలను ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. త్రివిధ దళాల పనితీరును మరింత మెరుగు పరిచేందుకు చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ నియామకాన్ని 2019లో ప్రకటించారు. ఆ క్రమంలో ఈసారి మోదీ ఆరోగ్య రంగానికి సంబంధించి హీల్‌ ఇన్‌ ఇండియా, హీల్‌ బై ఇండియా పేరిట కొత్త పథకాలు ప్రకటిస్తారంటున్నారు. ఆయన ఎర్రకోటపై జెండా ఎగరేయడం, పంద్రాగస్టు ప్రసంగం చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి.

రక్షణ వలయంలో ఢిల్లీ
పంద్రాగస్టు నేపథ్యంలో కశ్మీర్‌ మొదలుకుని కన్యాకుమారి దాకా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీలో శుక్రవారం ఆరుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. 144వ సెక్షన్‌ అమల్లో ఉంది. అడుగడుగునా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎర్రకోట వద్ద పతాకావిష్కరణ వేడుకకు 7,000 మందికి పైగా అతిథులు రానుండటంతో 10 వేల మంది భద్రతా సిబ్బంది కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేశారు.

2017లో మోదీ పంద్రాగస్టు ప్రసంగ సమయంలో ఓ పతంగి ఆయన ముందున్న పోడియంపై వచ్చి పడింది. ఈ నేపథ్యంలో ఈసారి వేడుక ముగిసేదాకా ఎర్రకోటకు 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల్లో పతంగులు, బెలూన్లు, డ్రోన్లు ఎగరేయడాన్ని పూర్తిగా నిషేధించారు. పంద్రాగస్టు వేడుకలను బహిష్కరించాలన్న పిలుపుల నేపథ్యంలో కశ్మీర్‌లో భద్రతను మరింతగా పెంచారు. సరిహద్దుల వెంబడి సైన్యం, బీఎస్‌ఫ్‌ మరింత అప్రమత్తమయ్యాయి.   

 – న్యూఢిల్లీ

మరిన్ని వార్తలు