24 గంటల్లో 78 వేల కేసులు

1 Sep, 2020 05:53 IST|Sakshi

36 లక్షలు దాటిన కోవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. సోమవారం తాజాగా మరో 78,512 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,245కు చేరుకుంది. 24 గంటల్లో 971 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 64,469కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,74,801కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,81,975గా ఉంది. యాక్టివ్‌ కేసుల కంటే 19.5 లక్షలకు పైగా కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం.

దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. సోమవారానికి ఇది 76.62 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.78 శాతానికి పడిపోయిందని తెలిపింది. ఆగస్టు 30 వరకు 4,23,07,914 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. సోమవారం మరో 8,46,278 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. వారం రోజుల్లోనే 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.   దేశంలో మొత్తం 1,583 ల్యాబుల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. 8 రోజుల్లో 5లక్షలకు పైగా కరోనా రోగులు కోలుకున్నారు.  

త్వరలో కోవాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌
భువనేశ్వర్‌: దేశీయంగా తయారు చేస్తున్న కరోనా టీకా ‘కోవాక్సిన్‌’త్వరలోనే రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో అడుగుపెట్టనుం దని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఐఎంఎస్‌) ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ వెంకటరావు తెలిపారు. మొదటి దశ టీకా ప్రయోగంలో పాల్గొన్న వారిలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులు కనిపించలేదని చెప్పారు. రెండో దశ టీకా తీసుకున్న తర్వాత మళ్లీ 14 రోజులకు రెండో డోస్‌ ఇస్తామని చెప్పారు. వీరిని పరిశీలనలో ఉంచుతామని చెప్పారు.  భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌కు ఐసీఎంఆర్‌ అనుమతిచ్చిన 12 మెడికల్‌ కాలేజీల్లో ఐఎంఎస్‌ కూడా ఉంది.

మరిన్ని వార్తలు