కశ్మీర్లో పాక్‌ దుస్సాహసం

14 Nov, 2020 03:55 IST|Sakshi
భారత సైన్యం ప్రయోగించిన క్షిపణి ధాటికి కుప్పకూలిన పాక్‌ బంకర్‌; ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కశ్మీర్‌ బాలలు

భారత భద్రతాబలగాలు, పౌరులు లక్ష్యంగా విచక్షణారహిత కాల్పులు

బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ, నలుగురు జవాన్లు, ఆరుగురు పౌరులు మృతి

గట్టిగా తిప్పికొట్టిన భారత్‌; క్షిపణులు, రాకెట్లతో ఎదురుదాడి

పాక్‌కు భారీ నష్టం; 8 మంది జవాన్లు హతం

బంకర్లు, ఇంధన గిడ్డంగులు, ఉగ్రవాద చొరబాటు కేంద్రాలు ధ్వంసం

శ్రీనగర్‌: పాకిస్తాన్‌ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకశ్మీర్లో శుక్రవారం సరిహద్దుల వెంట పలు చోట్ల  భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. పాక్‌ కాల్పులకు భారత్‌ దీటుగా బదులిచ్చింది. భారత్‌ జరిపిన ఎదురు కాల్పుల్లో 8 మంది పాక్‌ జవాన్లు చనిపోయారు. దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఉడి, గురెజ్‌ సెక్టార్ల మధ్య పాకిస్తాన్‌ మోర్టార్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని, పౌర ఆవాసాలు లక్ష్యంగా కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు. భారత్‌ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు భారీగా నష్టం జరిగిందని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్‌ సైన్యానికి చెందిన మౌలిక వసతుల ప్రాంతాలు ధ్వంసమయ్యాయని వివరించారు. కొన్ని ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ఉపయోగించే స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు.

కల్నల్‌ కాలియా తెలిపిన వివరాల మేరకు... పాక్‌ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్‌ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. 8 మంది పౌరులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావర్, కేరన్,  నౌగమ్, గురెజ్‌ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. హజీపీర్‌ సెక్టార్లో పాక్‌ జరిపిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాకేశ్‌ దోవల్‌ చనిపోయారు.

ఒక జవాను గాయపడ్డారు. కమల్‌కోటే సెక్టార్లో ఇద్దరు పౌరులు, బాలాకోట్‌ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. ఉడి సెక్టార్లోని నంబ్లా ప్రాంతంలో పాక్‌ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే కుయత్నాన్ని  తిప్పికొట్టామని కల్నల్‌ కాలియా వెల్లడించారు. ‘కుప్వారా జిల్లా కేరన్‌ సెక్టార్‌లో ఎల్‌ఓసీ వెంట అనుమానాస్పద కదలికలను మన బలగాలు గుర్తించాయి. అది ఉగ్రవాదుల చొరబాటుగా గుర్తించి, వెంటనే స్పందించి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి’ అని వివరించారు. ఈ వారంలో ఇది రెండో చొరబాటు యత్నమని, మాచిల్‌ సెక్టార్లో ఈనెల 7న రాత్రి కూడా ఒక చొరబాటు యత్నాన్ని అడ్డుకుని, ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామన్నారు.

పూంఛ్‌లోని పలు ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులకు, మోర్టార్‌ షెల్లింగ్‌నకు పాల్పడిందని, భారత బలగాలు వాటికి దీటుగా స్పందించాయని జమ్మూలో రక్షణ శాఖ అధికారి తెలిపారు. ‘పాక్‌ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ రాకేశ్‌ దోవల్‌ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు చెందినవారు. 2004లో బీఎస్‌ఎఫ్‌లో చేరారు. ఆయనకు తండ్రి, భార్య, తొమ్మిదేళ్ల కూతురు ఉన్నారు. దేశ రక్షణలో ఆయన వీర మరణం పొందారు’ అని ఢిల్లీలోని బీఎస్‌ఎఫ్‌ అధికారి తెలిపారు. నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్‌ లొకేషన్‌లో ఎస్‌ఐ రాకేశ్‌ దోవల్‌తో పాటు విధుల్లో ఉన్న కాన్‌స్టేబుల్‌ వాసు రాజాకు గాయాలయ్యాయని, ఆయన  చికిత్స పొందుతున్నారని వివరించారు.

మరిన్ని వార్తలు