30 నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు తీసుకున్న 84 ఏళ్ల బామ్మ

18 Sep, 2021 19:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువ‌నంత‌పురం: భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 79 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చారు. అక్టోబరు నాటికి 100 కోట్ల డోసులు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేవలం శుక్రవారం రోజే  రెండు కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. అయితే కొన్నిచోట్ల వివిధ కారణాలతో వ్యాక్సినేషన్‌లో పలు తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఆరోగ్య అధికారి తప్పిదం కారణంగా అరగంట వ్యవధిలోనే మహిళకు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తండ‌మ్మ ప‌ప్పు అనే 84 ఏళ్ల బామ్మ 30 నిమిషాల వ్య‌వ‌ధిలో రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకుంది. రెండు సార్లూ ఆమె కోవీషీల్డ్ తీసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. వృద్ధురాలు వ్యాక్సిన్‌ కోసం తన కొడుకుతో కలిసి ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ కుమారుడితో ఓ గదిలోకి వెళ్లి మొదట టీకా వేసుకుంది. తిరిగి వస్తుండగా గదిలో చెప్పులు మరిచిపోయినట్లు ఆమెకు గుర్తొచ్చింది. ఈ విషయం కొడుకుతో చెప్పి చెప్పులు తీసుకొచ్చేందుకు వెళ్లింది. ఇంతలో ఓ మహిళా అధికారి వచ్చి తనను లోపలికి తీసుకెళ్లింది. తాను చెప్పేది వినకుండ కుర్చీలో కూర్చోమని చెప్పింది మరోవైపు ఓ న‌ర్సు వ‌చ్చి త‌న‌కు మ‌ళ్లీ టీకా వేసింది. 

అయితే ఆమె అరగంట వ్యవధిలోనే రెండు టీకాలు తీసుకున్నానని ఆరోగ్య సిబ్బందికి  పదేపదే చెప్పడంతో తండమ్మను గంటపాటు గదిలో కూర్చోమని చెప్పారు. ఆమె క్షేమంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి పంపించేశారు. ప్రస్తుతం బామ్మ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.
చదవండి: బెంగళూరులో సామూహిక ఆత్మహత్యల కలకలం
సీపీ అంజనీ కుమార్‌ను బెదిరించిన వ్యక్తి ఆ రాష్ట్రంలోనే

మరిన్ని వార్తలు