40 ఏళ్ల వ్యక్తికి తన బెడ్ ఇచ్చేసిన తాత.. 3 రోజులకే!

28 Apr, 2021 18:50 IST|Sakshi

ముంబై: భారత్‌లో కరోనా రెండో దశ కరాళ నృత్యం చేస్తోంది. కనివీని ఎరుగని రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు దొరక్క కరోనా బాధితులు కన్నుమూస్తున్నారు. వీరిలో నాకు కరోనా వచ్చింది.. బతుకుతానో లేదో అనే ఆందోళతోనే ఎక్కువ మంది మరణిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో ఆసుపత్రిపాలైన ఓ ముసలాయన 40 ఏళ్ల వ్యక్తికి తన బెడ్‌ ఇచ్చి గొప్ప మనుసును చాటుకున్నాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన నారాయణ భావురావ్ దభాద్కర్ అనే వృద్ధుడు ఇటీవల కరోనా బారిన పడి ఇందిరాగాంధీ ఆస్పత్రిలో చేరారు.

అయితే అదే సమయంలో ఆస్పత్రికి ఓ మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఏడుస్తూ పరిస్థితి విషమంగా ఉన్న తన భర్తను చేర్చుకోవాలని ఆసుపత్రి అధికారులను వేడుకుంటోంది. కానీ.. బెడ్స్‌ ఖాళీగా లేవని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ విషయాన్ని గమనించాడు దభద్కర్. వెంటనే తన బెడ్‌ను ఆ మహిళ భర్తకు త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం డాక్టర్‌కు చెప్పగా ఆశ్చర్యపోయిన డాక్టర్ ‘ఏం మాట్లాడుతున్నారు మీరు’ అన్నారు. వెంటనే పెద్దాయన ‘అవును మీరు విన్నది నిజమే. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. నా జీవితం మొత్తం గడిపేశాను. ఆమె భర్త చిన్నవాడు. ఆ ఫ్యామిలీ బాధ్యత అతనిదే. అతని పిల్లలకు అతను కావాలి. కాబట్టి నాకు బదులుగా ఈ బెడ్‌ను అతనికి ఇవ్వండి.’ అని దభాద్కర్ ఆసుపత్రి అధికారులకు చెప్పారు.

ముసలాయన మాటలు విన్న వైద్యులు, తన పిల్లలు అంగీకరించలేదు. కానీ చివరికి ఒప్పుకున్నారు. నారాయణ కోరిక మేరకు ఆస్పత్రి నిర్వాహకులు. ఓ పేపర్‌పై ‘నేను నా ఇష్టపూర్వకంగానే మరో పేషెంట్‌కి నా బెడ్ ఖాళీ చేసి ఇస్తున్నాను’. అని లిఖితపూర్వక సంతకం తీసుకున్నారు. తరువాత నారాయణ ఇంటికి వచ్చారు. దురదృష్టవశాత్తు మూడు రోజుల తరువాత ఆయన ఆక్సిజన్‌ శాతం పడిపోయి ప్రాణాలు విడిచాడు. ముసలాయన ఉదారత గురించి తెలుసుకున్న నెటిజన్లు ‘మీరు త్యాగం చేసింది బెడ్‌ మాత్రమే కాదు.. మీ ప్రాణాలను సైతం త్యాగం చేశారు’ అని ప్రశంసిస్తున్నారు.

చదవండి: 
గుడ్‌ న్యూస్‌: ధర విషయంలో దిగొచ్చిన కోవిషీల్డ్‌
‘నా భార్యకు గుక్కెడు నీళ్లవ్వలేదు.. వాళ్లే చంపేశారు’

మరిన్ని వార్తలు