Madya Pradesh: కన్నీటికే కన్నీరు! రెండేళ్ల తమ్ముడు మృతి.. రెండు గంటలు జాడలేని తండ్రి

11 Jul, 2022 06:00 IST|Sakshi

ఒడిలో తమ్ముడి శవంతో సాయం కోసం బాలుడి ఎదురు చూపులు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మోరేనా పట్టణంపై హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. అంబా జిల్లాలోని బాద్‌ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్‌ జాతవ్‌ అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండేళ్ల చిన్న కుమారుడు రాజాను మోరేనా జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు గుల్షన్‌ తండ్రి వెంట ఆస్పత్రికి వచ్చాడు.

రక్తహీనత, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. పూజారామ్‌ చేతిలో చిల్లిగవ్వ లేదు. పసిబిడ్డ మృతదేహాన్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియక తల్లడిల్లాడు. ఆస్పత్రి వారు ఎలాంటి వాహనం ఏర్పాటుచేయలేమన్నారు. కనిపించిన వారినల్లా సాయం కోసం అర్థించాడు. ఇక చేసేది లేక తన బిడ్డ మృతదేహాన్ని భుజానికెత్తుకొని ఆసుపత్రి బయటకు నడిచాడు.

రోడ్డు పక్కన గుల్షన్‌ను కూర్చోబెట్టి ఒడిలో రాజా మృతదేహాన్ని ఉంచి, సాయం కోసం వెళ్లాడు. దాదాపు రెండు గంటల పాటు తమ్ముడి శవంతో గుల్షన్‌ అక్కడే తండ్రి రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడి మృతదేహంపై వాలే ఈగలను తోలుతున్న గుల్షన్‌ను చూసి అటుగా వెళ్లేవాళ్ల హృదయం ద్రవించింది. నాన్న ఎప్పుడు వస్తాడో తెలియక భయంతో కన్నీరు పెట్టాడు.

తనతో కలిసి ఆడుకున్న తమ్ముడి ఇక లేడని ఏడుస్తున్న గుల్షన్‌ను చూసి స్థానిక జర్నలిస్టు ఒకరు ఆ ఫొటోలు తీశారు. ఇంతలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమికూడారు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసు అధికారి యోగేంద్ర సింగ్‌ రంగంలోకి దిగారు. రాజా చికిత్స పొందిన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, వాహనం ఏర్పాటు చేశారు. రాజా శవాన్ని, అతడి తండ్రిని, సోదరుడిని వారి స్వగ్రామానికి పంపించారు.

మరిన్ని వార్తలు