కేంద్రంలో 9 లక్షల ఉద్యోగ ఖాళీలు.. విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

21 Jul, 2022 20:14 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలలో మొత్తం 9,79,327 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సిబ్బంది, ప్రధాన మంత్రి కార్యాలయ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం కింద పనిచేసే పే రీసెర్చి వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో 9 లక్షల 79 వేల ఉద్యోగ ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయడం లేదని చెప్పారు.
చదవండి: ఏపీలో 5876 మంది చిరు వ్యాపారులకు పెన్షన్

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత ఆయా మంత్రిత్వ శాఖలదే. అదో నిరంతరం ప్రక్రియ. ఉద్యోగుల రిటైర్మెంట్‌, ప్రమోషన్‌, రాజీనామా, మరణం వంటి కారణాలతో ఖాళీలు ఏర్పడతాయని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడే ఉద్యోగ ఖాళీలన్నింటినీ నిర్దిష్ట కాల పరిమితిలోగా భర్తీ చేయాలని ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు