రాష్ట్రపతి భవన్‌ ముందు తొమ్మిదేళ్ల బాలిక నిరసన

17 Oct, 2020 11:24 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌ ముందు తొమ్మిదేళ్ల బాలిక లిసిప్రియా కంగుజమ్‌ నిరసనకు దిగింది. దేశ రాజధానిలో స్వచ్ఛమైన గాలి కరువైందని ఆక్షేపించింది. గురువారం రాత్రి ప్రాంభమైన ఆమె నిరసన కార్యక్రమం శుక్రవారం ఉదయం వరకూ కొనసాగింది. ‘కాలుష్యకారక గాలి పీల్చలేక ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయడతామని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ నాయకులేమో చర్యలు తీసుకోవడం మరచి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో ఫ్రెష్‌ ఎయిర్‌ కోసం ప్రభుత్వాలు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ చర్యలేమీ తీసుకోలేదు! కలుషిత గాలిని పీల్చడం వల్ల ప్రతియేడు ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
(చదవండి: ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత)

మాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఢిల్లీ కాలుష్యం నుంచి రక్షించండి. పటిష్టమైన క్లయిమేట్‌ ‘లా’ తీసుకురండి’ అని ఆమె ప్లకార్డు ప్రదర్శింది. ఆమె వెంట మరికొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు ఉన్నారు. అనంతరం వారంతా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ని కలిశారు. ప్రమాదకర కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసేయాలని, దేశ రాజధానిలో వాతావరణ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.లిసిప్రియ మణిపూర్‌ యాక్టివిస్ట్‌. బెంగళూరు ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుతోంది. డాక్టర్‌ ఎ.పి.జె.అబ్దుల్‌ కలామ్‌ చిల్డ్రన్‌ అవార్డు, వరల్డ్‌ చిల్డ్రన్స్‌ పీస్‌ ప్రైజ్, ఇండియా పీజ్‌ ప్రైజ్, రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ఎర్త్‌ డే నెట్‌వర్క్, ఎస్‌.డి.జీస్‌ అంబాసిడర్‌ అవార్డు, నోబెల్‌ సిటిజన్‌ అవార్డులను లిసిప్రియ అందుకుంది. పర్యావరణ కార్యకర్తల్లో ప్రపంచంలోనే ఆమె అత్యంత పిన్నవయస్కురాలిగా పేరొందింది.
(చదవండి: అడుగుతున్నా చెప్పండి)

మరిన్ని వార్తలు