బాల భారతం.. బలహీనం

7 Jun, 2021 04:53 IST|Sakshi

9.27 లక్షల మంది చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార సమస్య 

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడి 

2020 నవంబర్‌ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు బాధిత బాలల గణాంకాలు విడుదల

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విసిరిన పంజాకు లక్షల కుటుంబాల ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. ఫలితంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలకు సరైన పోషకాహారం అందడం లేదు. బాల భారతం బలహీనంగా మారుతోంది. దేశంలో గత ఏడాది నవంబర్‌ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారుల్లో 9,27,606 మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలిందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ వెల్లడించింది.

బాధితుల్లో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, బిహార్‌లోనే ఉన్నారని తెలియజేసింది. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 3,98,359 మంది, బిహార్‌లో 2,79,427 మంది బాధిత బాలలు ఉన్నారు. లద్దాఖ్, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్‌లో తీవ్రమైన పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న చిన్నారులెవరూ లేకపోవడం గమనార్హం.  

అనారోగ్య ముప్పు అధికం
ఎత్తుకు తగిన బరువు లేకుండా... చాలా బలహీనంగా ఉంటే తీవ్రమైన పోషకాహార లోపంగా (ఎస్‌ఏఎం) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్వచించింది. ఈ సమస్యతో బాధపడుతున్న చిన్నారులు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ బరువు ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే.. అలాంటి వారికి ఏదైనా వ్యాధి సోకితే మరణించే అవకాశాలు 9 రెట్లు అధికంగా ఉంటాయి. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న బాలల సంఖ్య ఇంకా పెరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘‘దేశంలో కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోతున్నారు. నిరుద్యోగ సమస్య వేగంగా పెరుగుతోంది. ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలయ్యింది. ఫలితంగా ఆకలి రక్కసి కాటేస్తోంది.

ఆకలి ఉన్నచోట పోషకాహార సమస్య కచ్చితంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయాలి’’అని హెచ్‌ఏక్యూ సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఇనాక్షీ గంగూలీ సూచించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. 2020 నవంబర్‌ నాటికి ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల్లో తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు మహారాష్ట్రలో 70,665 మంది, గుజరాత్‌లో 45,749, ఛత్తీస్‌గఢ్‌లో 37,249, ఒడిశాలో 15,595, తమిళనాడులో 12,489, జార్ఖండ్‌లో 12,059, ఆంధ్రప్రదేశ్‌లో 11,210, తెలంగాణలో 9,045, అస్సాంలో 7,218, కర్ణాటకలో 6,899, కేరళలో 6,188, రాజస్తాన్‌లో 5,732 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఈ సమాచారం సేకరించారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్‌వాడీ కేంద్రాలదే కీలక బాధ్యత అని ఇనాక్షీ గంగూలీ చెప్పారు. చిన్నారులు, కౌమార బాలికలు, మహిళల్లో పోషకాహార సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో పోషన్‌ అభియాన్‌ పథకాన్ని ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు