ఖాళీగా ఇంట్లో కూర్చోలేను బిడ్డా!

6 Mar, 2021 16:51 IST|Sakshi
వృద్ధుడు విజయ్‌ పాల్‌ సింగ్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

వైరలవుతోన్న 98 ఏళ్ల వృద్ధుడి వీడియో

వృద్దుడిని సన్మానించిన రాయ్‌బరేలి జిల్లా మెజిస్ట్రేట్‌

లక్నో: కాళ్లు, చేతులు అన్ని సరిగా ఉండి.. ఒంట్లో సత్తువ ఉన్నా.. పని చేయాలంటే బద్దకిస్తారు కొందరు. పని నుంచి తప్పించుకోవడానికి సాకులు వెతుకుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ వార్త చదివి.. వీడియో చూస్తే.. తప్పకుండా సిగ్గుపడతారు. ఏందుకంటే ఇక్కడ మనం చెప్పుకోబోయే వృద్ధుడు 98వ ఏట కూడా చేతనైన పని చేసుకుంటూ.. కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ వయసులో ఇంత కష్టం అవసరమా తాత అంటే... ఊరికే ఖాళీగా ఇంట్లో కూర్చోని ఉండలేను బిడ్డ​ అంటున్నాడు. తాత పనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తెగ వైరలయ్యింది. దాంతో జిల్లా మెజిస్ట్రేట్‌‌ ఆ తాతకు సన్మానం చేశారు. ఆ వివరాలు..

ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలికి చెందిన విజయ్‌ పాల్‌ సింగ్‌ వయసు 98 ఏళ్లు. సాధారణంగా ఇంత పెద్ద వయసులో ముసలి వారు ఇళ్లు కదల లేరు. కొందరిని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మరో మనిషి తోడు లేనిదే.. వారి జీవితం గడవదు. అయితే అదృష్టం కొద్ది విజయ్‌ పాల్‌ సింగ్‌ ఈ వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. తన పనులన్ని తానే చేసుకోగలడు. అంతేకాక ఒంట్లో ఇంకా సత్తువ ఉండటంతో తనకు చేతనైన పని చేస్తున్నాడు. 

ఈ క్రమంలో తాత ప్రతిరోజు తన ఇంటి సమీపంలోని రోడు పక్కన ఓ తోపుడు బండి పెట్టుకుని.. దాని మీద ఉడికించిన శనగలు.. మొలకలు పెట్టుకుని అమ్ముతుంటాడు. తనది చాలా పెద్ద కుటుంబం అని.. ఇలా పని చేయడం తన ఇంట్లో వారికి ఇష్టం లేదని.. కానీ ఊరికే ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చదని.. అందుకే ఈ పని చేస్తున్నాను అని తెలిపాడు విజయ్‌ పాల్‌ సింగ్‌.

ఇందుకు సంబంధించిన వీడియోని అలోక్‌ పాండే అనే వ్యక్తి తన ట్విట్టర్‌లో షేర్‌ చేయడంతో ఇది తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో రాయ్‌బరేలి జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్‌ శ్రీవాస్తవ.. విజయ్‌ పాల్‌ సింగ్‌ని తన కార్యాలయానికి ఆహ్వానించి11,000 రూపాయల నగదును అందజేశారు. డబ్బుతో పాటు శాలువా కప్పి సన్మానం చేసి వాకింగ్ స్టిక్, సర్టిఫికేట్‌ అందజేశారు. అంతేకాక ప్రభుత్వ పథకం కింద వృద్ధుడికి ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయ్‌ పాల్‌ సింగ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. మా ముఖ్యమంత్రి కూడా దీనిని గమనించారు ... ఆయన ఎవరి బలవంతం మీదనో ఈ పని చేయడం లేదు. ఆయన మా అందరికి స్ఫూర్తి. అందుకే అతడికి రేషన్ కార్డు, మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు ఇచ్చాము. ఆయనకు ప్రభుత్వం తరఫున ఇంకా ఏమైనా కావాలంటే వాటిని కూడా సమకూరుస్తాం’’ అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజనులు తాతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి: 
ఏమైందో ఏమో.. పాపం పండుటాకులు..
కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్‌ దీన గాథ

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు