ఎన్‌బీఎఫ్‌సీలు : ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు  

23 Jan, 2021 11:41 IST|Sakshi

నాలుగు అంచెల నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదించిన ఆర్‌బీఐ    

అభిప్రాయాలు తెలియజేయడానికి నెల రోజుల గడువు  

ఎన్‌బీఎఫ్‌సీలు మరింత పటిష్టం! 

సాక్షి, ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుడుతోంది. ఈ దిశలో నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది. ఆర్‌బీఐ విడుదల చేసిన చర్చా పత్రం ప్రకారం- ‘బేస్‌ (ఎన్‌బీఎఫ్‌సీ-బీఎల్‌), మిడిల్‌ (ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎల్‌), అప్పర్‌ (ఎన్‌బీఎఫ్‌సీ-యూఎల్‌), టాప్‌ (ఎన్‌బీఎఫ్‌సీ-టీఓపీ)’ అనే నాలుగు అంచల నియంత్రణలోకి ఎన్‌బీఎఫ్‌సీలు వెళతాయి. వారి పరిమాణం, నిధుల సమీకరణ పరిస్థితులు, అనుసంధాన విధాన ప్రక్రియలు, స్థిరత్వం, క్లిష్టత, క్రియాశీలత విషయంలో తీరు తెన్నులు వంటి అంశాల ప్రాతిపదికన ఈ వర్గీకరణ ఉంటుంది. ‘‘ఎన్‌బీఎఫ్‌సీలకు సవరించిన నియంత్రణా వ్యవస్థ– అంచలవారీ ధోరణి’’ అన్న పేరుతో వెలువడిన ఈ ఆర్‌బీఐ చర్చా పత్రంపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను నెలరోజుల్లో పంపాల్సి ఉంటుంది.   (రూ.100 నోటు షాకింగ్‌ న్యూస్‌!)

ఎన్‌బీఎఫ్‌సీల ప్రయాణం... 
పలు సంవత్సరాలుగా పటిష్ట నియంత్రణలు, పారదర్శకత దిశగా ఎన్‌బీఎఫ్‌సీ రంగం అడుగులు వేస్తూ వస్తోంది. 1964 నుంచీ ఎన్‌బీఎఫ్‌సీలు ఆర్‌బీఐ నియంత్రణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2006లో సెంట్రల్‌ బ్యాంక్‌ సమగ్ర రెగ్యులేటరీ ఫ్రేమ్‌ వర్క్‌ను ప్రవేశపెట్టింది. 2014లో దీనిని మరోసారి సమీక్షించి, మార్పులూ చేర్పులూ చేయడం జరిగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్‌బీఐ నియంత్రణా పరమైన చర్యలను తీసుకుంటూనే ఉంది. పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలకు అదనపు నియంత్రణలూ అమలు జరుగుతున్నాయి. ‘‘సంస్థల  వ్యాపార వృద్ధిపై తగిన నియంత్రణలు లేకపోతే, అనుసంధాన ఫైనాన్షియల్‌ వ్యవస్థలో వ్యవస్థాకతమైన ఇబ్బందులు తలెత్తుతాయి. భారీగా విస్తరించిన ఎన్‌బీఎఫ్‌సీలో ఏదైనా సమస్య తలెత్తితే, అది మొత్తం ఫైనాన్షియల్‌ వ్యవస్థపై ప్రతికూలత చూపుతుంది. ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. చిన్న, మధ్య స్థాయి ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా  ఈ ప్రభావం కనబడుతుంది’’ అని ఆర్‌బీఐ తన చర్చా పత్రంలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణా పరమైన పటిష్టతా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది. జాగ్రత్తలతో కూడిన, వర్గీకృత నియంత్రణా వ్యవస్థలు ఎన్‌బీఎఫ్‌సీల పటిష్టతకు దారితీస్తాయన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. 

వర్గీకరణ విధమిది...

  • ఎన్‌బీఎఫ్‌సీ-బీఎల్‌: రూ.1,000 కోట్ల వరకూ అసెట్‌ సైజ్‌ పరిమాణం ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీలు అత్యధిక భాగం ఇదే కేటగిరీలోకి వెళతాయి.  డిపాజిట్లు స్వీకరించని 9425 ఎన్‌బీఎఫ్‌సీల్లో 9209 ఇదే విభాగం కిందకు వస్తాయి.  
  • ఎన్‌బీఎఫ్‌సీ-ఎంఎల్‌: ‘వ్యవస్థాగతంగా ప్రాముఖ్యత కలిగిన’’ ప్రస్తుత అన్ని నాన్‌–డిపాజిట్‌ టేకింగ్‌ ఎన్‌బీఎఫ్‌సీలు అలాగే డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విభాగంలోకి వస్తాయి.  
  • ఎన్‌బీఎఫ్‌సీ-యూఎల్‌: ‘‘వ్యవస్థాగతంగా కీలకంగా గుర్తించిన 25 నుంచి 30 టాప్‌ ఎన్‌బీఎఫ్‌సీలు ఈ పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల విషయంలో ఎలాంటి రెగ్యులేషన్లు ఉంటాయో, వీటికీ అవే వర్తిస్తాయి.  
  • టాప్‌ లేయర్‌: ఈ విభాగం ప్రస్తుతానికి ఖాళీగా ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి చోటుచేసుకునే సవాళ్లకు అనుగుణంగా ఈ విభాగాన్ని పునర్‌నిర్వచించడం జరుగుతుంది.   
>
మరిన్ని వార్తలు