లైంగిక దాడి: యువకుడికి ఉరిశిక్ష.. మెలికపెట్టి మరో తీర్పు

29 Apr, 2021 11:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యావజ్జీవంగా ఉరిశిక్ష

నిందితుడిపై కోర్టు కరుణ 

సాక్షి, చెన్నై: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హతమార్చిన కేసులో నిందితుడికి కింది కోర్టు విధించిన ఉరి శిక్షను మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. యావజ్జీవ శిక్షగా మారుస్తూ తీర్పు వెలువరించింది. అయితే, యావజ్జీవ కాలం ముగిసినా, జీవితాంతం అతడు జైల్లో ఉండే రీతిలో మెలిక పెట్టి తీర్పు ఇచ్చింది. కోయంబత్తూరు కుడిమలూరులో ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలిక అదృశ్యం కావడం రెండేళ్ల క్రితం కలకలం రేపింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఎక్కడ అదృశ్యమైందో అక్కడే ఆ బాలిక మృత దేహంగా తేలింది. ఆ బాలికపై లైంగికదాడి జరిగినట్టు విచారణలో తేలింది. ఈ కిరాతకానికి ఆ ఇంటి పక్కనే ఉన్న సంతోష్‌కుమార్‌(34) అనే యువకుడు పాల్పడినట్టు తేలింది. అతడ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

కోయంబత్తూరు కోర్టు తొలుత కేసును విచారించి తీర్పు వెలువరించింది. నిందితుడికి ఉరి శిక్ష విధించడమే కాకుండా, బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ధ్రువీకరణకు హైకోర్టుకు కింది కోర్టు నుంచి పంపించారు. అదే సమయంలో సంతోష్‌కుమార్‌ అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసుకున్నాడు. హైకోర్టు న్యాయమూర్తులు పీఎన్‌ ప్రకాష్, శివజ్ఞానం బెంచ్‌ విచారిస్తూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో బుధవారం తీర్పు వెలువరించింది.  

ఉరి రద్దు.. 
నిందితుడికి కింది కోర్టు ఇచ్చిన శిక్షను హైకోర్టు ధ్రువీకరించింది. పోక్సో చట్టంలో అరెస్టులను ధ్రువీకరిస్తూ, నిందితుడికి రూ. లక్ష జరిమానా విధించింది. అయితే, ఇటీవల కాలంగా కొన్ని కేసుల తీర్పుల్లో సుప్రీంకోర్టు పేర్కొన్న అంశాలను గుర్తు చేస్తూ, నిందితుడికి విధించిన ఉరి శిక్షను రద్దు చేశారు. ఈ శిక్షను యావజ్జీవంగా మార్చారు. యావజ్జీవ కాలం ముగిసినా,  25 సంవత్సరాల వరకు విడుదల చేసేందుకు వీలు లేదని తీర్పులో బెంచ్‌ స్పష్టం చేసింది. అలాగే శిక్ష తగ్గింపునకు సైతం ఆస్కారం లేదని, జీవితాంతం జైల్లో ఉండాల్సిందేనని పేర్కొంటూ తీర్పు ఇచ్చారు. కింది కోర్టు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ మొత్తాన్ని చెల్లించకుంటే, తక్షణం అందజేయాలని ఆదేశిస్తూ గడువును కోర్టు కేటాయించింది.
చదవండి: అత్తతో గొడవలు.. కొత్త కోడలు ఆత్మహత్య

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు