అలర్ట్‌: ఐడెంటిటీ ప్రూఫ్‌గా ఆధార్‌ కార్డు.. యూఐడీఏఐ కీలక ప్రకటన

24 Nov, 2022 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యక్తిగత గుర్తింపు ఆధార్‌ విషయంలో.. ఆధార్‌ నిర్వహణ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’(యూఐడీఏఐ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఆధార్‌ వివరాలను ధృవీకరించుకున్నాకే.. ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా అంగీకరించాలంటూ సూచించింది.  

ఆధార్‌ లెటర్‌, ఇ-ఆధార్‌, ఆధార్‌ పీవీసీ కార్డ్‌, ఎం-ఆధార్‌.. ఇలా ఆధార్‌ ఏ రూపంలో అయినా సరే ఐడెంటిటీ ఫ్రూఫ్‌గా తీసుకునే సమయంలో.. అందులో సమాచారం సరైందేనా? కాదా? అని ధృవీకరించాలని యూఐడీఏఐ పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.ఆధార్‌ వివరాలను ధృవీకరించుకునేందుకు క్యూఆర్‌ కోడ్‌లు, ఎం-ఆధార్‌ యాప్‌, ఆధార్‌ క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌లు ఉన్నాయని తెలిపింది.

డెస్క్‌యాప్‌ వెర్షన్‌తో పాటు మొబైల్స్‌ ద్వారా ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు సెప్టెంబర్‌లో ఆధార్‌ వివరాల దుర్వినియోగ  కట్టడికి పలు కీలక సూచనలు పౌరుల కోసం జారీ చేసిన విషయాన్ని యూఐడీఏఐ గుర్తు చేసింది.  అంతేకాదు.. ఆధార్ వెరిఫికేషన్‌ ద్వారా ఐడెంటిఫికేషన్‌ డాక్యుమెంట్‌ దుర్వినియోగానికి ఆస్కారం ఉండదని తెలిపింది. అనైతిక, సంఘ వ్యతిరేక అంశాలను అడ్డుకున్నట్లు అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆధార్‌ వినియోగం సక్రమంగా జరుగుతుందని, నకిలీ ఆధార్‌ల కట్టడికి తోడ్పడుతుందని స్పస్టం చేసింది. 

ఆధార్‌ పత్రాలను ట్యాంపరింగ్‌ గనుక చేస్తే.. ఆధార్‌ యాక్ట్‌ సెక్షన్‌ 35 ప్రకారం శిక్షార్హమైన నేరమని, జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని తెలిపింది. అంతేకాదు ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటీ కింద ఆధార్‌ సమర్పించేప్పుడు దానిని ధృవీకరించుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రాలు తప్పనిసరి చేయాలంటూ యూఐడీఏఐ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: మీరు నోరు మూస్తారా? సుప్రీంలో ఏజీ అసహనం

మరిన్ని వార్తలు