పాల్ఘర్‌లో మరో విమానాశ్రయం..

31 Oct, 2021 13:57 IST|Sakshi

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఏర్పాటుకు నిర్ణయం 

‘పర్యటన్‌ పరిషద్‌’లో వెల్లడించిన పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే 

ముంబైలో సేవలు 24 గంటలు అందుబాటులో ఉండాలన్న మంత్రి 

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగర భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాల్ఘర్‌లో మరో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ముంబైలోని విమానాశ్రయం పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండగా, నవీ ముంబైలో నిర్మిస్తున్న విమానాశ్రయం కూడా భవిష్యత్‌ అవసరాలను తీర్చలేదని, అందుకే పాల్ఘర్‌లో మూడో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం కరోనా కోరల్లో నలుగుతున్న సమయంలో కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు విధానపరమైన నిర్ణయాలెన్నో తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

‘పర్యటన్‌ పరిషద్‌’అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ముంబైలో కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ 50 మీటర్ల వరకు నిర్ధారించామని, కొంకణ్‌ ప్రాంతం విషయంలో కూడా జనవరి వరకు శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ముంబై, ఠాణే, రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, మరాఠ్వాడా, విదర్భతో సహా రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక స్థలాల్ని అభివృద్ధి పరిచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ముంబైతో పోల్చితే పాల్ఘర్‌లో మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా ఉందని, కాబట్టి ఈ ప్రాంతం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్తులో ముంబై, నవీ ముంబైలోని విమానాశ్రయాల సేవలు సరిపోవని, అందుకే పాల్ఘర్‌లో విమానాశ్రయాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఒక విమానాశ్రయాన్ని నిర్మించేందుకు పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు 24 గంటల పాటు తెరిచే ఉంటున్నాయని, దాంతో ఆయా నగరాలు, ప్రభుత్వాల ఆదాయం పెరిగిందని చెప్పారు. ముంబైలో కాల్‌సెంటర్‌ లాంటి వ్యాపారాలు 24 గంటలు కొనసాగుతున్నాయని, కానీ, హోటల్స్‌ మూసివేయడం వల్ల ఆ సంస్థల్లో పనిచేసేవారికి రాత్రిపూట ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముంబై విశ్వనగరంగా మారి ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో నగరంలోని అన్ని సేవలు 24 గంటలపాటు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో ప్రకృతి, సాగర తీరం, గడీలు, ఖిల్లాలు, ఆరోగ్య, ధార్మిక రంగాలకు చెందిన పలు పర్యాటక స్థలాల్ని అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని, ఆయా ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించి పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఉత్పత్తి రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, అదేవిధంగా సేవారంగంలోనూ అభివృద్ధి సాధించి ఉపాధి అవకాశాల్ని పెంచాలని పేర్కొన్నారు. పర్యాటక, హోటల్‌ రంగాలకు కావాల్సిన అనుమతులను 80 నుంచి 10కి తగ్గించామని, ముంబైలోని వాంఖడే స్టేడియంలో క్రికెట్‌ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాలీవుడ్‌ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ పర్యాటకాన్ని పెంచేందుకు ద్రాక్ష, సంత్ర లాంటి తోటల్లో మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేసే విధానాన్ని రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు