బాలీవుడ్‌తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే

5 Aug, 2020 10:28 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌ ప్రముఖులతో స్నేహం చేయడం నేరమేమీ కాదని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు. తన తండ్రి, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు చూసి ఓర్వలేకే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే కొంతమంది సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణాన్ని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగడం సరికాదని హితవు పలికారు. కాగా బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదిత్య ఠాక్రేపై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్‌ను వేధించిన బీ-టౌన్‌ ప్రముఖులకు ఆయన అండగా ఉన్నారని, ఈ కేసు నుంచి వాళ్లను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ముంబై పోలీసులు, బిహార్‌ పోలీసులకు సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. (కంగన రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు)

ఈ క్రమంలో బాలీవుడ్‌ ప్రముఖులతో ఆయన దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై ఇన్నాళ్లు మౌనం వహించిన ఆదిత్య ఠాక్రే మంగళవారం ఎట్టకేలకు ట్విటర్‌ వేదికగా స్పందించారు.‘‘హిందువుల హృదయసామ్రాట్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే మనుమడిని నేను. మహారాష్ట్ర, శివసేన, ఠాక్రే కుటుంబానికి ఉన్న ప్రతిష్టకు భంగం కలిగించే పనులు ఎన్నటికీ చేయబోను. ఇవన్నీ చెత్త రాజకీయాలు. అందుకే నేను నిశ్శబ్దంగా ఉన్నాను. సినీ ఇండస్ట్రీ కూడా ముంబైలో ఒక భాగమే. వేలాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. కొంతమంది సినీ ప్రముఖులతో నాకు వ్యక్తిగత స్నేహం ఉంది. అదేమీ నేరం కాదు కదా. కరోనా వైరస్‌ కట్టడికై మహారాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడుతోంది. సానుకూల ఫలితాలు సాధిస్తోంది. ఇది చూసి ఓర్వలేకే కొంత మంది సుశాంత్‌ కేసును రాజకీయం చేస్తున్నారు’’ అని ఆదిత్య ఠాక్రే ఓ ప్రకటన విడుదల చేశారు.(సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో )
 
కాగా డిప్రెషన్‌ కారణంగా సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ముంబై పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు రాగా.. అతడి‌ది ముమ్మాటికి హత్యేనని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ప్రేయసిగా ప్రచారంలో ఉన్న నటి రియా చక్రవర్తిపై పట్నాలో కేసు నమోదు కావడంతో బిహార్‌ పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అప్పటి నుంచి మహారాష్ట్ర, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్‌వార్‌ ప్రారంభమైంది. ఈ క్రమంలో సుశాంత్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కోరబోమని ఉద్ధవ్‌ సర్కారు స్పష్టం చేయగా..  సుశాంత్‌ తండ్రి కేకే సింగ్ సమ్మతంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మంగళవారం స్పష్టం చేశారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా