అనూహ్యం.. మోదీ సొంత రాష్ట్రంలో కేజ్రీవాల్‌ పాగా

23 Feb, 2021 21:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాగా వేశారు. ఆదివారం జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కన్నా ఆమ్‌ ఆద్మీ పార్టీ సత్తా చాటింది. బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆప్‌ నిలిచింది. ఈ ఎన్నికల్లో సూరత్‌ కార్పొరేషన్‌లో రెండో స్థానంలో నిలవడం విశేషం. దీంతో ఆప్‌కు పంజాబ్‌, గోవా తర్వాత గుజరాత్‌లో బలపడే అవకాశం లభించింది. 

సూరత్‌ కార్పొరేషన్‌ ఫలితాలతో ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన సూరత్‌లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సూరత్‌ కార్పొరేషన్‌లో మొత్తం వార్డులు 120 ఉండగా బీజేపీ 93 గెలవగా ఆమ్‌ ఆద్మీ పార్టీ 27 స్థానాలు సొంతం చేసుకుంది. ఈ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. ఈ ఫలితాలపై ఆమ్‌ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఢిల్లీ పాలనను గుజరాత్‌కు అవసరమని పేర్కొంది.

అయితే ఆరు కార్పొరేషన్‌లలో ఒక్క సూరత్‌ తప్పా మిగతా చోట ఆప్‌ బోణీ చేయకపోవడం గమనార్హం. మిగతా కార్పొరేషన్‌లలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్‌ నిలిచింది. అవి కూడా చాలా తక్కువ సీట్లే. అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదర, రాజ్‌కోట్‌, భావ్‌నగర్‌, జామ్‌నగర్‌ కార్పొరేషన్‌లో 547 స్థానాల్లో 576 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 450 స్థానాలు సొంతం చేసుకోగా, కాంగ్రెస్‌ 58, ఆమ్‌ఆద్మీ పార్టీ 27, ఇతరులు 8 స్థానాలు సొంతం చేసుకున్నారు.

చదవండి: అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాని లీకులు
చదవండి: కాంగ్రెస్‌కు షాక్‌ మీద షాక్‌: ఆ సీటు కమలం ఖాతాలోకి

>
మరిన్ని వార్తలు