గుజరాత్‌ ఎన్నికలతో చరిత్ర సృష్టించిన ఆప్‌.. దేశంలో తొమ్మిదో పార్టీగా రికార్డ్‌

8 Dec, 2022 17:15 IST|Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలతో ఢీలా పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఊరట లభించింది. గుజరాత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. జాతీయ పార్టీ హోదాను సంపాదించేందుకు కృషి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు, దేశప్రజలకు  అభినందనలు తెలిపారు. కాగా గుజరాత్‌లో నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆప్‌ మరో స్థానంలో ముందంజలో ఉంది. గుజరాత్‌ ఎన్నికల్లో 13 శాతం ఓట్లను సాధించింది. 

ప్రస్తుతం దేశంలో ఎనిమిది పార్టీలు జాతీయ హోదా పొందాయి. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఎన్నికల సంఘం జాతీయ పార్టీలుగా గుర్తించింది. గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్‌ జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తొమ్మిదో పార్టీగా నిలిచింది.

ఒక రాజకీయ పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 2 సీట్లు, 6శాతం ఓట్లు సాధిస్తే కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.. ఆప్‌ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో ఆప్ జాతీయ హోదా ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆప్‌ నాలుగు రాష్ట్రాల్లో తమ ప్రజాప్రతినిధులను కలిగి ఉంది. 
చదవండి: Himachal Election Results: కాంగ్రెస్‌ ఘన విజయం.. సీఎం రాజీనామా

>
మరిన్ని వార్తలు