‘అసెంబ్లీలో కలకలం: ఆత్మహత్యకు యత్నం’

31 Mar, 2021 21:14 IST|Sakshi

న్యూఢిల్లీ: తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఓ ప్రజాప్రతినిధి కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమె అధికార పార్టీకి చెందిన నాయకురాలే కావడం గమనార్హం. ఆమె చర్యతో ఆ సమావేశంలో గందరగోళం ఏర్పడింది. చివరకు అందరూ కల్పించుకుని ఆమెతో ఆ ప్రయత్నం విరమింపజేశారు. అనంతరం ఆ సమస్యపై ఆమె ప్రభుత్వ పెద్దలకు ఆల్టిమేటం జారీ చేసింది.

ఢిల్లీలోని మల్కాగంజ్‌ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్‌ గుడి దేవి మంగళవారం నిర్వహించిన మున్సిపల్‌ సమావేశానికి హాజరైంది. అయితే సమావేశానికి కిరోసిన్‌ బాటిల్‌తో వచ్చింది. తన ప్రాంతంలో ఉన్న మున్సిపల్‌ కార్మికులను తొలగించారని ఆమె ఆందోళన చేసింది. 206 మంది ఉండాల్సిన కార్మికుల్లో 115 మందిని తొలగించడంతో ప్రస్తుతం 85 మంది ఉన్నారని తెలిపింది. దీంతో తన ప్రాంతంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వాపోయింది. సమస్య పరిష్కరిస్తారా లేదా అని కిరోసిన్‌ బాటిల్‌తో గుడి దేవి హల్‌చల్‌ చేసింది. వెంటనే స్పందించిన అధికారులు ఆమె చేతిలో నుంచి కిరోసిన్‌ డబ్బాను తీసుకుని శాంతపరిచారు. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మేయర్‌ హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు