Arvind Kejriwal: బీజేపీలోకి 277మంది ఎమ్మెల్యేలు.. రూ.5,500కోట్లు..

26 Aug, 2022 18:58 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ దారుణంగా విఫలమైందని రుజువు చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఈమేరకు వ్యాఖ్యానించారు.

ఒక్కక్కరికి రూ.20కోట్లు ఇచ్చి మొత్తం 40 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఆపరేషన్ లోటస్ గురించి చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. బీజేపీ అనుకున్నట్లు జరగలేదని, ఒక్క ఆప్ ఎమ్మెల్యే కూడా ప్రలోభానికి లొంగలేదని కేజ్రీవాల్ అన్నారు. అది రుజువు చేసేందుకే విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ఆపరేషన్ కమలం కాస్తా ఆపరేషన్ బురద అయిందని సైటెర్లు వేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి మొత్తం 277మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలు వెళ్లారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. వారికి ఒక్కొక్కొకరి రూ.20కోట్లు ఇచ్చి ఉంటే మొత్తం రూ.5,500 కోట్లు అవుతుందని లెక్కగట్టారు. సామాన్యుల డబ్బును ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే వాడటం వల్లే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. 

దేశంలో ఇప్పటివరకు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అసోం, మధ్యప్రదేశ్, బిహార్, అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. సీరియల్ కిల్లర్‌లా వరుస ఖూనీలు చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ తమపై తప్పుడు కేసులు పెడుతూనే ఉంటుందని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.  దేశ వ్యతిరేక శక్తులన్నీ ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని లక్ష‍్యంగా చేసుకున్నాయని విమర్శించారు. ఆప్ ఎమ్మెల్యేలను చీల్చాలని చూశారని, కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టిందని చెప్పారు.
చదవండి: బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఆజాద్‌

మరిన్ని వార్తలు