దేవుడే ఆప్‌ అనే విత్తనాన్ని నాటాడు.. శ్రీకృష్ణుడిలా రాక్షసుల సంహారం చేస్తోంది

19 Sep, 2022 09:03 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని శ్రీకృష్ణుడితో పోల్చుకున్న ఆయన.. పార్టీ పుట్టుక దేవుడి జోక్యం వల్లే జరిగిందంటూ కామెంట్లు చేశారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆప్‌ తొలి జాతీయ సమావేశం ‘రాష్ట్రీయ జన ప్రతినిధి సమ్మేళన్‌’లో ఆ పార్టీ కన్వీనర్‌ హోదాలో ఆయన ప్రసంగించారు. 

ఆప్‌ పుట్టింది నవంబర్‌ 6, 2012లో. 63 ఏళ్ల కిందట.. ఈ తేదీనే మన దేశం రాజ్యాంగాన్ని దత్తత తీసుకుంది. ఆప్‌ పుట్టుక ఏదో యాదృచ్ఛికం కాదు. దేవుడి జోక్యంవల్లే జరిగింది. దేవుడు దేశాభివృద్ధి కోసం ఆప్‌ అనే విత్తనాన్ని నాటాడు. అది మొలకెత్తి ప్రతీ రాష్ట్రంలోనూ పెరుగుతూ.. మనకు అనితర బాధ్యతలను అప్పజెప్పుతోంది అంటూ వ్యాఖ్యానించారాయన. ఢిల్లీ, పంజాబ్‌లో వృక్షాలుగా ఎదిగి.. అక్కడి ప్రజలకు సంక్షేమ ఫలాలు, నీడను అందిస్తోంది. గుజరాత్‌లోనూ ఈ ఆప్‌ విత్తనం.. చెట్టుగా ఎదగడం ఖాయం అని గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారయన. 

పుట్టిన పదేళ్లలో ఇంతలా ఎదిగిన పార్టీ బహుశా దేశంలో ఆప్‌ మాత్రమే కావొచ్చని చెప్పారాయన. ఆప్‌ను శ్రీ కృష్ణుడితో పోల్చిన కేజ్రీవాల్‌.. పసివయసులో కృష్ణుడి ఎలాగైతే రాక్షస సంహారం చేశాడో.. అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగంలాంటి రాక్షసులను ఆప్‌ వధిస్తుంది అంటూ కార్యకర్తలు, కీలక నేతల మధ్య హుషారుగా ప్రసంగించారు కేజ్రీవాల్‌.  ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండడం మాత్రమే కాదు.. 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థానిక విభాగాల్లో, పంచాయితీల్లో 1,446 మంది ఆప్‌ ప్రతినిధులు పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు.

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తథ్యమన్న భయం బీజేపీకి పట్టుకుందని, అందుకే అవినీతిపై యుద్ధం పేరిట ఆమ్‌ ఆద్మీ పార్టీని(ఆప్‌) నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతోందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. తప్పుడు అవినీతి కేసుల్లో తమ పార్టీ నాయకులను, మంత్రులను ఇరికించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కుతంత్రాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. గుజరాత్‌లో ఆప్‌ బలం నానాటికీ పెరుగుతుండాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.  గుజరాత్‌లో ఆప్‌ కార్యక్రమాలకు కవరేజీ ఇవ్వొద్దంటూ ప్రధానమంత్రి మీడియా సలహాదారు హీరేన్‌ జోషీ మీడియా సంస్థలను బెదిరిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడానికి బీజేపీ ఇప్పటిదాకా 285 మంది ఎమ్మెల్యేలను కొనేసిందని ఆరోపించారు. ‘ఆపరేషన్‌ కమలం’ కింద రూ.7,000–రూ.8,000 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు.  కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్‌  కేజ్రీవాల్‌ చేసిన ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆదివారం తిప్పికొట్టారు. కేజ్రీవాల్‌ మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక ఆప్‌ను శ్రీకృష్ణుడితో కేజ్రీవాల్‌ పోల్చుకోవడంపై బీజేపీ నేతలు సెటైర్లు, విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగాలు లేకపోతే మంచి భవిష్యత్తు లేదు

>
మరిన్ని వార్తలు