AAP MLA: ఆప్ ఎమ్మెల్యేకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ

17 Sep, 2022 18:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ వక్ఫు బోర్డులో అవినితీ ఆరోపణలకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది న్యాయస్థానం. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ ఈయనను శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అమానుతుల్లా ఖాన్‌తో పాటో అతని అనుచరుడు హమీద్ అలీ ఖాన్, ఇమామ్ సిద్ధిఖీని కూడా తనిఖీల అనంతరం ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

2020లో అమానుతుల్లా ఖాన్ వక్ఫు బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో 32 మందిని నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాల్లో నియమించారని ఆరోపణలు వచ్చాయి. అంతేగాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన నివాసంతో పాటు అనుచరుల నివాసాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. అనంతరం అధికారులు రూ.12లక్షల నగదుతో ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అమాతుల్లా ఖాన్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల కస్టడీ కోరగా.. న్యాయస్థానం నాలుగు రోజులకే అనుమతి ఇచ్చింది.

అమానుతుల్లా అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఆప్ గుజరాత్‌లో బలపడటం చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా మంది ఆప్ ఎ‍మ్మెల్యేలను బీజేపీ అరెస్టు చేయిస్తుందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు.
చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్

>
మరిన్ని వార్తలు