సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కొడుకు.. తల్లి మాత్రం స్వీపర్‌గానే.. ఎవరా మహిళ..?

13 Mar, 2022 16:56 IST|Sakshi

ఛండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ.. జాతీయ పార్టీలకు షాకిస్తూ భారీ మెజార్టీతో విజయం సాధించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ ఈనెల 16వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భదౌర్ నియోజకవర్గం నుంచి సీఎం అభ్యర్థి చరణ్​​జీత్ సింగ్ చన్నీపై ఆప్‌ అభ్యర్థి లాభ్ ​సింగ్ పోటీ చేసి 37వేలకు పైగా మెజారిటీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా లాభ్‌ సింగ్‌ ఫేమస్‌ అయ్యాడు. 

కాగా, తన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడని ఊరంతా సంబురాలు జరుపుకుంటుడగా.. ఆయన తల్లి మాత్రం సాదాసీదాగా తన పని తాను చేసుకుంటోంది. ఎమ్మెల్యే లాభ్​​ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్​ ప్రభుత్వ పాఠశాలలో కొన్నేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. తన కొడుకు ఎమ్మెల్యే అయినప్పటికీ తాను ఇదే వృత్తిలో కొనసాగుతానని పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. తన కొడుకు ఎన్నికల్లో గెలుస్తాడని మొదటి నుంచి ధీమాగానే ఉన్నట్టు తెలిపింది. రానున్న రోజుల్లో లాభ్ సింగ్ కచ్చితంగా పంజాబ్​లో మార్పులు తీసుకొస్తాడని చెప్పింది. అతడు అందరికీ వైద్యం, విద్య అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్‌గా పని చేస్తానని స్పష్టం చేసింది. 

లాభ్ ​సింగ్ తండ్రి దర్శన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా తన కొడుకు పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా, లాభ్‌ సింగ్‌ 2013లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరాడు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ కొద్దికాలంలోనే కీలక నేతగా ఎదిగాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 

ఇది చదవండి: ఆ సినిమాకు ప్రధాని మోదీ ప్రశంసలు..

మరిన్ని వార్తలు