పాలు, పెట్రోల్‌ పోటీపడుతున్నాయా?.. బీజేపీపై ఆప్‌ విమర్శలు

15 Oct, 2022 17:32 IST|Sakshi

గాంధీనగర్‌: పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు అమూల్‌ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్‌తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్ధా. ధరలపై ఉదాసీనత ప్రదర్శించే ప్రభుత్వ తప్పులతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాయని విమర్శించారు.  

ఫుల్‌ క్రీమ్‌ మిల్క్‌, గేదె పాలపై లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్‌ బ్రాండ్‌ పేరిట మార్కెటింగ్‌ చేసే గుజరాత్‌ కో-ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలవుతాయని వెల్లడించింది. దీనిపై ఆప్‌ ఎంపీ రాఘవచద్దా ట్వీట్‌ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్‌ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్‌ పాల ధరలు లీటర్‌కు రూ.2 చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పాల ధరలు మళ్లీ పెరుగనున్నాయి? కారణాలు.. పశుగ్రాసం ధరల విపరీతంగా పెరగటం, లంపీ వైరస్‌ వ్యాప్తి’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పశుగ్రాసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, దాంతో రైతులు ఇతర పంటలను పశువులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు రాఘవ్‌ చద్ధా. పశుగ్రాసం ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒక్క గుజరాత్‌లోనే గత రెండేళ్లలో 1.36 లక్షల హెక్టార్ల పశుగ్రాసం సాగు తగ్గిపోయిందన్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడిన క్రమంలో 2020లో 100 ఎఫ్‌పీఓలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకు ఒక్కటి సైతం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు.

ఇదీ చదవండి: రాహుల్‌ ఓ ఫెయిల్డ్‌ మిసైల్‌.. కాంగ్రెస్‌ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై

మరిన్ని వార్తలు