కాంగ్రెస్‌కి ఓటు వేస్తే... బీజేపీ ఎమ్మెల్యేని ఎన్నుకున్నట్లే..

14 Sep, 2022 14:06 IST|Sakshi

న్యూఢిల్లీ: గోవాలోని 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఈ రోజు బీజేపీలోకి వెళ్లడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ చద్దా బీజేపీపై పెద్ద ఎత్తున విమర్శల దాడి చేశారు. ఆపరేషన్‌ కమలం ఢిల్లీ, పంజాబ్‌లలో విఫలమైంది కానీ గోవాలో విజయవంతమైందని ఎద్దేవా చేశారు. అంతేగాదు కాంగ్రెస్‌కి ఓటు వేస్తే మీరు కాబోయే బీజేపీ ఎమ్మెల్యేని ఎన్నకుంటారు అని తెలుసుకోండి అంటూ చద్ధా ట్విట్టర్‌ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పని అయిపోయిందని, ముక్కులు ముక్కలుగా విడిపోయిందని చెప్పారు.

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌​ కూడా కాంగ్రెస్‌ పని ముగిసిందంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌, ఢిల్లీలో బీజేపీ తన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ 20 నుంచి 25 కోట్లకు కొనుగోలు చేయడానికి ట్రై చేసి విఫలమైందని ఆప్‌ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి బీజేపీ చేస్తున్న పనిని ఆపరేషన​ కీచడ్‌(మడ్‌)గా వ్యవహరించారు. బీజేపీ అన్ని రకాల వ్యూహాలను ఉపయోగించిందని అన్నారు.

గుండాలతో బెదిరింపులు, డబ్బులు ఎర వంటి అన్నింటిని వినియోగించి బీజేపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందంటూ ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ , సీనియర్‌ నాయకుడు మైఖేల్‌ లోబో నేతృత్వంలో సుమారు 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరారు. కాంగ్రెస్‌ ఈ దుశ్చర్యను జులైలో అడ్డుకోగలిగింది కానీ రాహుల్‌ గాంధీ నేతృత్వంలో భారత్‌ జోడో యాత్ర(యునైట్‌ ఇండియా మార్చ్‌) లో ఉండటంతో అదును చూసి బీజేపీ ఈ వ్యూహానికి తెరలేపిందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

(చదవండి: బీజేపీలో ప్లాన్‌ సక్కెస్‌..గోవాలో కాంగ్రెస్‌ ఖాళీ)

మరిన్ని వార్తలు